రామమందిరమే కాదు..

– సమస్యలూ పరిష్కరించాలి
– బీజేపీపై ఓటర్లలో అసంతృప్తి
– ధరల పెరుగుదలపై అత్యధికంగా 29 శాతం మంది
– ఆ తర్వాత స్థానాల్లో నిరుద్యోగం, పేదరికం
– సీఎస్‌డీఎస్‌-పోస్ట్‌పోల్‌ డేటా
న్యూఢిల్లీ : యూపీలోని అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమం కాదంటూనే.. అంతకు మించి హడావుడిని మోడీ సర్కారు ప్రదర్శించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి కేవలం మూడు నెలల ముందు వ్యూహాత్మకంగా దీనిని ప్లాన్‌ చేసింది. రామమందిర అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అందరి దష్టిని ఆకర్షించేలా మోడీ సర్కారు ప్రణాళికలు రచించింది. లోక్‌సభలో ఓట్లు రాల్చటమే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలనూ చేసింది. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించి..కార్యక్రమం సందర్భంగా మోడీ ప్రసంగించారు. హిందువుల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవచ్చని కాషాయపార్టీ భావించింది. అయితే, బీజేపీ వ్యూహం లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఫలించలేదు. అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్‌ పార్లమెంటు స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి.. ఎస్పీ క్యాండిడేట్‌ చేతిలో ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అయోధ్యలో రామ మందిరం గురించి భారత ఓటర్లు ఏం భావిస్తున్నారు? ఇది ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపించిందన్న విషయంపౖౖె సీఎస్‌డీస్‌-పోస్ట్‌ పోల్‌ సమాచారం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రజలు రామ మందిరం మాత్రమే కాకుండా సమస్యలపైనా మంచి అవగాహనను కలిగి ఉన్నారు. పలు సమస్యల విషయంలో మోడీ సర్కారుపై వారు అసంతృప్తిలో ఉన్నారు. సీఎస్‌డీఎస్‌ సమాచారం ప్రకారం.. బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ‘అత్యంత ఆమోదిత పని’ అనే బహిరంగ ప్రశ్నకు సమాధానంగా 22 శాతం మంది రామ మందిర నిర్మాణాన్ని ప్రస్తావించారు. పేదరికాన్ని తగ్గించటం, ఉపాధి అవకాశాలను సృష్టించటం వంటివాటిని బీజేపీ ప్రభుత్వ రెండో, మూడో అత్యంత ఇష్టపడే పనులుగా వివరించారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ‘అత్యంత ఆమోదయోగ్యం లేని పని’ గురించిన బహిరంగ ప్రశ్నకు సమాధానంగా.. ‘ధరల పెరుగుదల’పై 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, 27 శాతం మంది నిరుద్యోగాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న పేదరికం కూడా ప్రభుత్వ అత్యంత ఇష్టపడని పనులలో ఒకటిగా ఉద్భవించిందని ప్రజలు భావిస్తున్నారు. 11 శాతం మంది ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణానికి ప్రజలు మద్దతు ఇస్తూనే.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి ఇతర సమస్యలతో సహా దేశంలో నెలకొన్న ఆర్థిక సవాళ్లను కూడా వారు పరిగణనలోకి తీసుకుంటుండటం గమనార్హం. ప్రజలకు ఓటు వేసే విషయంలో సామాజిక, రాజకీయ సమస్యల కంటే ఆర్థిక సమస్యలు ప్రాధాన్యతనిస్తాయని డేటా వెల్లడిస్తున్నది.
సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి ప్రీ-పోల్‌ అధ్యయనంలో ఒక బహిరంగ ప్రశ్నకు ప్రతిస్పందనగా.. ‘రామమందిరాన్ని’ ప్రభుత్వం అత్యంత ఇష్టపడే పనిగా పేర్కొన్న వారిలో నాలుగింట ఒక వంతు (25 శాతం మంది) నిరుద్యోగాన్ని అత్యంత ముఖ్యమైన ఓటింగ్‌ సమస్యగా గుర్తించారు. ప్రతి 10 మందిలో ఇద్దరు (22 శాతం మంది) ధరల పెరుగుదలను పేర్కొన్నారు. సాపేక్షంగా 19 శాతం మంది రామమందిర నిర్మాణాన్ని ముఖ్యమైన ఓటింగ్‌ సమస్యగా పరిగణించారు. బీజేపీ పలు స్థిరమైన ప్రయత్నాలు చేసినప్పటికీ.. అయోధ్య అంశాన్నే ప్రజలు ఆధారంగా చేసుకోలేదన్నది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ రామ మందిర అంశమే కీలకమైతే, ఫైజాబాద్‌ వంటి కీలక స్థానంలో బీజేపీ విజయం సాధించేదని వారు అంటున్నారు.