తెలంగాణ రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాలకు నూతన వైస్ ఛాన్సలర్‌ల నియామకాలకు రాష్ట్ర విద్యాశాఖ జనవరి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. నూతన వైస్ ఛాన్సలర్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 1382 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం నియమించిన వీసీల పదవీకాలం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే ఇన్‌ఛార్జీలను పెట్టకుండా నూతన వీసీల నియామకాలను చేయాలని నిర్ణయించడం అభినంద నీయం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేంద్రా లుగా ఉన్న వర్సిటీలు నేడు ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధికి దూరం గా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తున్న నిధులు సరి పోక, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక, విలవిల్లాడుతున్నాయి. దీనికి గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా అనేకం. కొత్త ప్రభుత్వం చేపడుతున్న ఈ నియామకాల ద్వారా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యలు పరిష్కారం చేసి వర్శిటీలను అభివృద్ధి చేసినప్పుడే అసలైన మార్పు.
పారదర్శకంగా వీసీల నియామకాలు జరగాలి
రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాలు లేక కొన్నేండ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వీసీల కాలపరిమితి తీరిన తర్వాత రెండేళ్లు ఐఏఎస్ ఆఫీసర్లు వీసీలుగా పెట్టినప్పుడు విశ్వ విద్యాలయాలు తమ ప్రభను కోల్పోయి పరిపాలన నత్తనడకన సాగింది. మళ్లీ 2016లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వీసీల నియామకాలు జరిగిన తర్వాత 2019లో మళ్లీ ఇన్‌చార్జీ పాలన తర్వాత పూర్తిస్థాయిలో 2021లో వీసీల నియామకాలను చేపట్టింది లేదు.ఈ కాలమంతా ప్రభుత్వం యూనివర్సిటీలను ఎన్నడు పేదలకు విద్యనందించే కేంద్రాలుగా చూడలేదు. కనీసం ఈ రాష్ట్ర ఉద్యమం కోసం అగ్రభాగాన నిలిచిన కేంద్రా లుగా కూడా పట్టించుకోలేదు. కేవలం వాటిని రాజకీయ నాయ కుల పునరావాస కేంద్రాలుగా మార్చారు. అందుకే గత పదిహేనేండ్లుగా అధ్యాపక నియామకాలు చేపట్టకపోవడం, రిసెర్చ్ గ్రాంట్స్ విడుదల చేయకపోవడం, ఫలితంగా పరిశోధ నలు పక్కదారి పట్టాయి.
ఈ ప్రభుత్వంలో వీసీల నియామకాలపై జరిగిన చర్చలు, కోర్టు కేసులుగా కాకుండా రాజకీయ జోక్యం తావులేకుండా నియామకాల పక్రియ చేపట్టాలి. గతంలో యూనివర్సిటీల వీసీ ల నియామకానికి అర్హతలు కొంతమందికి లేవని హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. తమ వారినే, తమకు నచ్చిన విధంగా వ్యవహరించే వారికే వీసీల పోస్టులిచ్చారని, గతంలో యూజీసీ నామ్స్ ప్రకారం వారి అనుభవం, సర్వీస్ లెక్కలోకి తీసుకుని నియ మించాలని ఉన్నా అలా జరగలేదని, మితిమీరిన రాజకీయ జోక్యం కూడా కారణం అనే చర్చ జరుగు తోంది. ఇప్పటికే సెర్చ్ కమిటీల ఏర్పాటు, పాలక మండలి సభ్యుల సమావేశాలు జరిగిపోయాయి. ఇక్కడ సమావేశాలు జరిగిన నామిని ప్రతిపాదన లపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సెర్చ్ కమి టీలో నామినీల ప్రతిపాదనలు కోసం ఉన్నత విద్యా శాఖ అన్ని యూనివర్సిటీల పాలకమండళ్లతో సమావేశాలు నిర్వహించింది. వర్సిటీల రేసులో మళ్లీ పాత యూనివర్సిటీల వీసీలు కూడా ఉన్నారు. దీనిపై కూడా అభ్యంతరాలున్నాయి. రాజకీయ జోక్యం కారణంగా యూజీసీ నిబంధనలు భిన్నంగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కావాలని గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఇదంతా రాజకీయ నాయకుల అనుచరగణం కోసమే. ఇప్పటికే రాజకీయ జోక్యం కారణంగా కుల, మత ప్రభావంతో విశ్వవిద్యాలయాలు కుంటుపడ్డాయి. అభివృద్ధి లేక నాణ్యత లేక ప్రమాణాలు దిగజారిపోయి, యూని వర్సిటీలు ర్యాంకింగులూ పడిపోతున్నాయి. అందుకే వైస్-ఛాన్సలర్స్ నియమకాలు పారదర్శకంగా జరగాలి.
నిధుల కేటాయింపులు – ఖాళీల భర్తీ అవసరం
రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు యూనివర్సిటీల నిధులు క్రమంగా తగ్గాయి. అభివృద్ధి కోసం కేటాయించిన నిధు లు శూన్యం. కొత్తగా మహిళా, ఫారెస్ట్ యూనివర్సిటీలను గత ప్రభుత్వం తీసుకొచ్చిన బోర్డు తప్ప కనీసం సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియమాలను చేపట్టలేదు. నిధులు లేక బాసర ట్రిపుల్ ఐ.టి. విద్యార్థులు చేసిన ఆందోళనలు కూడా చూశాము. విద్యార్ధులకు మెస్, ల్యాబ్స్, లైబ్రరీ సౌకర్యాలు లేవు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో తరగతి గదులు లేక రేకులషెడ్డు కింద ఫార్మసీ, పాత హాస్టల్ భవనాలు నడుస్తున్నాయి. పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీల్లో గదులు, తలుపులు విరిగిపోయాయి, తాగునీటి సమస్యలున్నాయి. జెఎన్టీయూ ఫైన్‌ఆర్ట్స్, మహిళా యూనివర్సిటీలు విద్యార్థులకు ప్రధానంగా విద్యార్థినులకు హాస్టల్స్ లేక ఆందోళన బాట పట్టారు. ఇవన్నీ నిధులివ్వక, అభివృద్ధి లేక తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటు న్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అనేక సమస్యలున్నాయి. ఇంకా నిజాం నిర్మించిన రేకుల షెడ్ల హాస్టల్స్‌లోనే వసతి గృహాలు కొనసాగడం బాధాకరం. పాడుబడిన హాస్టల్స్ పెచ్చులూడి గాయాలపాలైన ఘటనలనేకం. ఎక్కడా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాలు పూనుకున్నది లేదు. నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గించే కుట్రలు చేస్తున్నారు. సరైన భోజన సదుపాయాలు లేవు. వైద్య, వసతి సదుపాయాలు అంతకన్నా కనపడవు. అనేక సార్లు నాణ్యమైన భోజనం కోసం ఉస్మానియా విద్యార్థినుల రోడ్డెక్కాల్సిన దుస్థితి. ఇంకో పక్క సౌకర్యాలతో పాటు ఖాళీలు భారీగా ఉన్నాయి. 2013 నుండి ఇప్పటివరకు రాష్ట్ర యూని వర్సిటీలలో నియామకాలు లేవు. గత ప్రభుత్వం తమకు తెలి యకుండా నియామకాలు చేపట్టవద్దని జీవో తెచ్చింది. రాష్ట్ర యూనివర్సిటీలలో కేవలం 24 శాతం మంది మాత్రమే రెగ్యులర్ పోస్టులున్నాయి. 76 శాతం పోస్టులు ఖాళీలున్నాయి. వర్సిటీ లలో వేధిస్తున్న ప్రధాన సమస్య భోదన, భోదనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం. సెంట్రల్ యూనివర్సిటీల తరహా రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలో వెంటనే నియ మించేలా నియామకాలు లేవు. 2020లోనే ప్రభుత్వమే ప్రకటించిన విధంగా రాష్ట్రంలో 8వేల భోదన, భోదనేతర పోస్టులు ఖాళీలున్నా, వాటిని భర్తీ చేయడం లేదు.
రాష్ట్రంలో రెగ్యులర్ పోస్టులు భర్తీ లేకపోవడంతో కాంట్రా క్టు, పార్ట్ టైం పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేశారు. 1365 మంది కాంట్రాక్టు, 700 మంది పార్టు టైమ్ అధ్యాపకులు వర్సిటీలో పనిచేస్తున్న వారికి కూడా జీతాలిచ్చే పరిస్థితి లేదు. రెగ్యులర్ అధ్యాపకులు లేరని కోర్సులు మూసివేస్తున్న దుస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో 2828 పోస్టులు మంజూరు కాగా 1869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 238 ప్రొఫెసర్, 781 -అసోసియేట్ ఫ్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకులు లేకపోవడంతో పరి శోధనలు కాదు, కనీసం చదువుకునే అవకాశం లేకుండా పోతోంది. దేశంలో మొట్టమొదటి భాషా యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీలో కేవలం మూడు మాత్రమే రెగ్యులర్ పోస్టులు. తెలుగు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో 152 రెగ్యులర్ పోస్టులకు 69 మాత్రమే ఉన్నాయి. ప్రతి యేటా గ్రూపులు, డీఎస్సీలు, నోటి ఫికేషన్స్ ద్వారా వేలాది పోస్టులు భర్తీ చేస్తున్నా, యూనివర్సిటీ లలో మాత్రం ఇప్పటికీ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోలేదు. ప్రొఫె సర్స్ ఎక్కువ మంది ఉంటే మన రాష్ట్ర యూనివర్సిటీలకు ఎక్కువ ప్రాజెక్టులొచ్చే అవకాశం ఉంది, కానీ ఆ దిశగా ప్రభుత్వాల ఆలోచనలు లేవు.
ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలి
రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రధానంగా యూనివర్సిటీ విద్య అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వమైనా కొన్ని ప్రత్యామ్నాయ పద్ధ తులు ఆలోచించాలి. గత ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా యూనివర్సిటీ విద్య, సౌకర్యాలపై సమీక్ష చేయలేదు. ఈ ప్రభు త్వం రెగ్యులర్‌గా సమీక్ష చేసి సమస్యలు పరిష్కరించాలి. అసలు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి? వాటిలో ఎలాంటి సమస్యలున్నాయి? అనేది నూతన ప్రభుత్వం ఆలోచించాలి. ధ్వంసమైన విద్యాభివృధ్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, నిర్ణయాలూ చేయాలి. పేద వర్గాల విద్యార్ధులను పరిశోధనలు చేయడానికి నేషనల్ ఫెలోషిప్స్ రాని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే నెలకు రూ.25 వేల ఫెలోషిప్స్‌నివ్వాలి, పీజీ నుంచి ప్రోత్సాహమందించేలా విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఫెలోషిప్స్ అందివ్వాలి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థుల స్కిల్స్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక శిక్షణను అందించాలి. కొత్త ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలి. రీసెర్చ్ గ్రాంట్స్ ఒక్క ఉస్మాని యాకే రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలి. నూతన హాస్టల్స్ నిర్మాణం, మోడ్రన్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, రిసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి, ప్రజాస్వామ్య రక్షణకు విద్యార్ధి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ప్రతి ఏడాది అన్ని యూనివర్సిటీలకు రిసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వాలి. విద్యార్ధినులపై వేధింపులు నిరోధించడానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమలు చేస్తూ ఐసీసీ జీఎస్ క్యాస్ కమిటీలను వేయాలి. రానున్న వీసీల నియామకాలొక్కటే కాకుండా ఈ చర్యలు తీసుకుని ప్రభుత్వం యూనివర్సిటీలను, వాటి అనుబంధ క్యాంపస్‌లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఉన్నత విద్య మెరుగుపడుతుంది.
టి.నాగరాజు 9490098292