బౌద్ధారామాల్నే కాదు బౌద్ధ సాహిత్యాన్ని కూడా మార్చారు

Not only the Buddhist scriptures but also the Buddhist literature was changedబౌద్ధం బాగా బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణీ ఇప్పటికీ బౌద్ధులుగానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఎలాగైతే ఇక్కడ మన భారతదేశంలో బ్రాహ్మణ వాదులు వారి దృష్టికోణంలోంచి వేదాలు, పురాణాలు రాసి ప్రచారం చేశారో అలాగే-వీరు ధ్వంసం చేయక ముందున్న బౌద్ధ జీవన మూలాలు, జాతక కథలు యధాతధంగా ఆయా దేశాలలో కొనసాగుతున్నాయి. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోనుకాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి-
బౌద్ధుల ‘వైపుల్య సూత్రా’లలో లంకావతార అనే ఒక పేరు తటస్థపడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధరాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే దశరథ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణవాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెపుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెపుతారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమాజంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్కడివి? అని ప్రశ్నించుకుంటే-ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహాయానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమయంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహారంలోకి తెచ్చారు. బౌద్ధ సాహిత్యంలోంచి కాపీకొట్టి తెచ్చుకున్నవీ పదాలు-అని గుర్తుపట్టకుండా సంస్కృతాన్ని కేవలం తమ జాతివారి మధ్యలోనే ఉండే విధంగా కట్టుదిట్టం చేసుకున్నారు. సంస్కృతం అందరూ చదవడానికి వీలు కల్పించలేదు. పైగా, రహస్యంగా చదువుకున్న వారికి కఠినమైన శిక్షలు అమలు పరిచారు. కథాంశంలోనూ, భాషలోనూ జరిగిన కల్తీని ఇతరులు పసికట్టకూడదన్న ఉద్దేశంతో వారు, వారి సంస్కృత భాషని సామాన్యులకు అందనీయలేదు. అందువల్ల, సంస్కృతం-బౌద్ధ హైబ్రిడ్‌ సంస్కృత(దీనూ)గా నిలిచిపోయింది. వారి సంస్కృత భాషా, వారి సంస్కృత గ్రం థాలు బహుజనులెవరూ చదవకుండా జాగ్రత్త వహించడానికి ఉన్న అనేక కారణాలలో ఇది ఒకటి పైగా ప్రధానమైంది.
దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు బ్రాహ్మణార్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్‌ సంస్కృత (దీనూ) భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతం-అని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, మార్చి హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంతమంది హిందూ దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు. అలాగే శ్రమన సమాజాన్ని వేరు వేరు పేర్లతో పిలిచి, సమాజాన్ని విభజించి, తమ ఆధిపత్యం చెక్కు చెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బౌద్ధుల ప్రభావం, ఆలోచనా ధోరణి సమాజంలో బలంగా ఉన్నందు వల్లనే కక్షగట్టి, బౌద్ధ విశ్వవిద్యాలయాలను బ్రాహ్మణార్యులు తగలబెట్టారు. ఒక్కోసారి విదేశీ ముస్లిం చొరబాటుదారుల సహాయం తీసుకున్నారు. చొరబాటుదారులకు కావల్సింది బంగారం, వెండి, ధనరాసులు మాత్రమే! అవి ఆయా విశ్వవిద్యాలయ భవనాల్లో దండిగా ఉన్నా యని తప్పుడు సమాచార మిచ్చి, వారిని ఉసిగొల్పి, నాశనం చేయించింది. ఇక్కడి బ్రాహ్మణార్యులే-ఇవన్నీ మహా మహా చరిత్రకారులు ఆధారాలతో రుజువు పరిచిన విషయాలు. ఆ రోజుల్లో దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో ఉండేవి. ఎన్నెన్నో రాజవంశాలూ ఉండేవి. బ్రాహ్మణార్యుల ప్రభావానికి లోనైన రాజవంశాలు వీరిని సలహాదారులుగా, గురువులుగా గౌరవించేవారు. అలా చేయని రాజవంశాల వారిని వీరు ‘శూద్రుల’ని వెలివేసేవారు.
25. మాయాదేవి సుత్తంలో
మాహాయాన్‌ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్‌ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి ”లలిత్‌ విస్తార్‌” అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే ”మహావస్తు”-అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయోగాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో.. అలాగే, బుద్ధుడి అను యాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు. లంకావతార్‌ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరి కొందరు ‘స్వయంభూ నాయక్‌’ అని, ‘వినాయక్‌’ అనీ, ‘పరిణాయక్‌’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్‌, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్‌, ప్రథాన కపిల్‌, భూతాంత్‌, రామ్‌, వ్లాస్‌, శుక్ర్‌, ఇంద్ర్‌, బలి, వరుణ, వంటి అనేక పేర్లతో పిలుచుకునేవారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్‌-అని కూడా అన్నారు.
బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణార్యులు అబద్దాలు ప్రచారం చేశారు. అవి ఇలా ఉన్నాయి. బుద్ధుడు ఒక రోగిని చూశాడు. ఒక వృద్ధుణ్ణి చూశాడు. తర్వాత చనిపోయిన వ్యక్తిని (శవాన్ని) చూశాడు. ఆయన మనసు వికలమై ఇల్లు వదిలేసి అడవిలో ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశాడు. జ్ఞానోదయమైంది. ఆయన ధ్యాన ముద్రలో ఉండగా నాగ ముచిళిందుడనే నాగుపాము వచ్చి, పడగవిప్పి ఆయనకు నీడ నిచ్చింది-వంటి కల్పనలు ప్రచారం చేసి జనాన్ని నమ్మించారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే నాగజాతి ఆదివాసులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు. ఒకప్పుడు ఆ జాతి వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతమే ఇప్పటి నాగపూర్‌ (బౌద్ధానికీ నాగపూర్‌కు సంబంధం ఉంది కాబట్టే, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆరు లక్షల మందితో 1956 ఆక్టోబర్‌ 14న అక్కడ ధమ్మ దీక్ష తీసుకున్నారు.)
బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజజీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. తేడా ఏమిటంటే మిగతా అవతారాలన్నీ కల్పితాల ఆధారంగా, భ్రమల ఆధారంగా సృష్టించుకున్నవి. బుద్ధుడు- ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. అయితే ఆయన వాస్తవ జీవితాన్ని కూడా మిగతా ఆవతారాలవలే కల్పనలతో ప్రచారం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది.
వైధిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకు, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోని తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మధనం-ఈ లోకంలోని దు:ఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మదన పడడం-జాగ్రత్తగా అవలోకిస్తే గానీ, రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు.
మనిషికి మనిషికి ఉండే సంబంధం హిందూధర్మంలో కృత్రిమమైంది. ధనవంతుడిగా ఉన్నప్పటి సంబంధాలు, పేదవాడైనప్పటి సంబంధాలకు తేడా ఉంది.ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు సంబంధాలు వేరు వేరుగా ఉంటున్నాయి. బౌద్ధం దాన్ని ఒప్పుకోదు. ప్రజ్ఞ-శీలం-కరుణను పెంచాలే గాని అహంకారాన్ని కాదు. సమస్త మానవుల్నే కాదు, సమస్త జీవరాసుల్ని ప్రేమించాలన్నాడు-బుద్ధుడు. శీలానికి సంబంధించి బుద్ధుడి మూల సూత్రాలు అయిదు ఉన్నాయి. 1.ప్రాణహానికి సంబంధించింది 2.అపహరణకు సంబంధిం చింది 3.లైంగికనీతికి సంబంధించింది 4.అసత్యానికి సంబంధిం చింది 5.తాగుడుకు సంబంధించింది. బుద్ధుని జీవితం ఎంత బుద్ధిపరమైందో అంత హృదయపరమైంది కూడా. కరుణను బోధించేదే-సద్దమ్మం! ప్రజ్ఞ శీలం బౌద్ధానికి ఆధారాలు. శత్రువు మనల్ని దెబ్బతీయాలని ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు. అలాం టప్పుడు మనం ఎదురుదాడికి దిగకుండా-శత్రువు మనల్ని పీడించకుండా, బలం పెంచుకోవాలన్నది బుద్ధుడి ఆలోచన!
హిందూ ధర్మం అసమానతలపై ఆధారపడి ఉంటే, బౌద్ధ ధమ్మం సమానత్వంపై ఆధారపడి ఉంది. ప్రపంచాన్ని మాన వీయ సమాజంగా తీర్చిదిద్దగలిగేది బౌద్ధమే. నిశితంగా గమనిస్తే భారత రాజ్యాంగంలో బౌద్ధం ఉంది. కార్యకారణ సంబంధాన్ని బుద్ధుడు గుర్తించాడంటే, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనల్లో బౌద్ధం ఉంది. ఆశోకచక్రం, సారనాథ్‌ స్థూపం ఈ దేశపు చిహ్నాల య్యాయి. రాష్ట్రపతి భవన్‌, దర్భార్‌హాలులో నిలువెత్తు బుద్ధ విగ్రహముంది. ఆ విగ్రహం పాదాలు-కొద్ది దూరంలో కిందనున్న ఇండియా గేట్‌ పైభాగానికి సమానంగా ఉంటాయి. ఇవన్నీ గుర్తుచేయడ మెందుకంటే, (బుద్ధుడు)-బౌద్ధం జన జీవనంలో ఎంతబలంగా అంతర్లీనమై పోయిందో ఆలోచిస్తారని! ఇతర ధర్మాలూ, మతాలు ప్రారంభించినవారు, తాము దేవతలమనో, దేవదూతలమనో చెప్పుకున్నారు. కేవలం బుద్ధుడే ‘అలా చెప్పుకోలేదు. కనీసం తన వారసుణ్ణి కూడా ప్రకటించ లేదు. ధమ్మమే వారసుణ్ణి ఎన్నుకుంటుందని అన్నాడు. తను చెప్పిన విషయాలు కూడా నిశితంగా పరిశీలించి, ఆలోచించి, అర్థం చేసుకోవాలన్నాడు. ఏదీ గుడ్డిగా నమ్మగూడదన్నాడు తను చెప్పిందైనా-
బుద్ధుణ్ణి ‘భగవాన్‌’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. భగవాన్‌ అంటే ఇక్కడ బ్రాహ్మణార్యుల భగవాన్‌ కాదు. బౌద్ధ ధమ్మ ప్రకారం భగవాన్‌ అంటే పరిపూర్ణతను సాధించిన వాడు (The Perfect Man) అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు. సర్వంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్‌ అంటే-ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహామానవుణ్ణి బౌద్ధులు భగవాన్‌-పరిపూర్ణతను సాధించినవాడా! అని గౌరవించు కుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి!
– కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు