బౌద్ధ విగ్రహాల్నే కాదు, బోధి వృక్షాన్ని కూడా కొట్టేశారు!

Not only the Buddhist statues, but also the Bodhi tree!బోధి-అంటే జ్ఞానం. బుద్ధుడికి ఏ చెట్టు కింద జ్ఞానోదయమైందో ఆ చెట్టును బోధి వృక్షం-అని అంటున్నాం. బీహార్‌లో గయా జిల్లాలోని బుద్ధగయలో మహాబోధి మందిర పరిసరాల్లో ఒక రావిచెట్టు ఉంది. దాని కింద సాధా రణ శకానికి ముందు 531లో గౌతముడికి జ్ఞానోదయమై బుద్ధుడయ్యాడు. ఈ చెట్టుకు ఆసక్తికరమైన కథ ఉంది. దాన్ని పెళ్లగించి, నాశనం చేయాలని ఎందరు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది మళ్లీ మళ్లీ చిగురిస్తూనే వచ్చింది. బౌద్ధాన్ని నాశనం చేయాలని ఎందరు ప్రయత్నించినా, అది ఎలాగైతే విశ్వవ్యాప్తమవుతూ వచ్చిందో…బుద్ధగయలోని బోధివృక్షం కూడా అలాగే పునరుజ్జీవనం పొందుతూ వచ్చింది.ఈ విషయం చాల విచిత్రంగా కూడా తోస్తుంది, అయితే అది నిజం!
ఈ బోధి వృక్షాన్ని నాశనం చేయాలన్న తొలి ప్రయత్నం సాధారణ శకానికి ముందు మూడవ శతాబ్దంలో జరిగింది. అశోక చక్రవర్తి బౌద్ధమతావలంబి అని అందరికీ తెలుసు. కానీ, అతని రాణులలో చివరిదైన త్రిశ్యరక్షిత దొంగచాటుగా ఆ వృక్షాన్ని నరికేయించింది. అప్పుడు అశోకుడు ఎక్కడో సుదూర ప్రాంతం పర్యటనలో ఉన్నాడు. హడావుడిగా కంగారులో చేసిన ఆ ప్రయత్నం వల్ల చెట్టు మొత్తానికి మొత్తంగా నాశనం కాలేదు. కొద్ది కాలానికే ఆ చెట్టు మొలకలు పైకి లేచి పెరగడం ప్రారంభిం చాయి. ఒక రకంగా అది రెండోతరం వృక్షం- అయ్యింది. సుమారు 800 ఏండ్లు బతికింది. గాంధార ప్రాంతానికి చెందిన త్రిశ్యరక్షితకు అసూయ ఎక్కువ. అశోకుడు బౌద్ధంపట్ల ఎక్కువ ధ్యాస పెట్టడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఓర్వలేనితనంతో కుట్రలు చేయడం ఆమె నైజం. అశోకుడి కుమారుడు గుడ్డివాడు కావడానికి ఈమే కారణం. కుట్రలన్నీ బయటపడి, మొహం చెల్లక, చివరకు ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించుకుంది. ఒక రకంగా తన ఆకృత్యాలకు తనే శిక్ష వేసుకుంది.
ఇక రెండోసారి ఆ వృక్ష్యాన్ని నాశనం చేయాలన్న దురాలోచన ఏడవ శతాబ్దం (జ.జు)లో బెంగాల్‌ రాజు శశాంకకు వచ్చింది. ఇతను బౌద్ధానికి బద్ధ విరోధి. ఆ చెట్టు ప్రాశస్తాన్ని భరించలేక పోయాడు. అందుకే అది మళ్లీ పెరగకుండా వ్రేళ్లతో సహా నాశనం చేయాలని ప్రయత్నించాడు. చెట్టు మొదటికే నరికేయించి, వ్రేళ్లను కూడా తగులబెట్టించాడు. అయినా ఈసారి మరో అద్భుతం జరిగింది. కొన్నేళ్ల తర్వాత కాలకుండా ఉండిపోయిన భూమి లోలోపలి పొరల్లోని వ్రేళ్లు మళ్లీ ప్రాణం పోసుకుని మొలకెత్తాయి, మొక్క పైకి లేచింది. దీన్నే మూడవ తరం వృక్షం అని అన్నారు. ఇది సుమారు 1250 ఏండ్లు బతికింది. సాధారణ శకం 1876లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ చెట్టు విరిగిపోయి, బాగా నాశనమై పోయింది. భారత దేశ ఆర్కియాలజీ విభాగపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న నాటి బ్రిటీషు అధికారి లార్డ్‌ అలెగ్జాండర్‌ కన్నింగ్హామ్‌ 1880లో శ్రీలంక అనురాధపురం నుంచి బోధి వృక్షపు శాఖను తెప్పించి మళ్లీ అక్కడే బుద్ధగయలో నాటించాడు. ఒక రకంగా ఇప్పుడున్నది నాలుగవ తరం వృక్షం అని చెప్పుకోవచ్చు-బ్రిటీష్‌ కాలంలో దేశంలోని బుద్ధ స్థావరాలన్నింటినీ తవ్వించి గత చరిత్రను వెలుగులోకి తెచ్చినవాడు కన్నింగ్హామ్‌.
ఒకప్పుడు బుద్ధ గయాలోని బోధివృక్షం నుండి చిన్న మొలకను తీసుకుపోయి, అక్కడ శ్రీలంకలోని అనురాధ పురంలో నాటించింది అశోక చక్రవర్తి కూతురు- సంఘమిత్రే. ఏండ్లకేండ్లు గడిచిన తర్వాత-మళ్లీ శ్రీలంక- అనురాధపురం నుండే కన్నింగ్హామ్‌, అదే బోధి వృక్షాన్నుండి మొలక తెప్పించి మళ్లీ ఇక్కడ బుద్ధగయలో నాటించడం విశేషం! ఆ విధంగా ఆ బోధి వృక్షం తనను తాను సంరక్షించుకున్నట్ట య్యింది. సాధారణ శకానికి ముందే శ్రీలంక ఒక బౌద్ధ దేశంగా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ ప్రపంచస్థాయి బౌద్ధ క్షేత్రాలలో ఇది ముఖ్యమైంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు విదీశాకు మధ్య గల సలామత్‌పూర్‌ కొండమీద 2012 జ.జులో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే తన వెంటతెచ్చిన బోధి మొక్కను స్వయంగా నాటాడు. ఇప్పుడు అది ఒక వివిఐపి వృక్షం.రాష్ట్ర వ్యవసాయ శాఖ నుండి ఒక వృక్ష శాస్త్రవేత్త వచ్చి చెట్టు ఆరోగ్యం పరీక్షించి వెళతాడు. వృక్ష రక్షణ కోసం ఎల్లప్పుడూ అక్కడ పోలీసు నిఘా ఉంటుంది. ఇది యునెస్కో గుర్తించిన సాంచీ బుద్ధిస్ట్‌ కాంప్లెక్స్‌కు ఐదు కి.మీ. దూరంలో ఉంటుంది. బౌద్ధ దేశం గనక, శీలానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం గనక-మొదట శ్రీలంక పేరు శీలాన-శిలోన్‌ అని ఉండేది. అదే వాడుకలో సిలోన్‌ అయ్యింది! బౌద్ధానికి ‘పంచశీల’ రూపొందింది.
1. ప్రాణుల్ని హత్య చేయకుండా ఉండే శీలాన్ని (గుణాన్ని) నేను స్వీకరిస్తున్నాను.
2. దొంగతనం చేయకుండా ఉండే శీలాన్ని స్వీకరిస్తున్నాను.
3. వ్యభిచారం చేయకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను.
4. అసత్యమాడకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను.
5. మత్తు కలిగించే మదిర, ఇతర మాదక ద్రవ్యాలు సేవించ కుండా ఉండగలిగే శీలాన్ని స్వీకరిస్తున్నాను – అని బౌద్ధం స్వీకరిం చేవారు. ప్రతినబూనుతారు. బుద్ధం శరణం గచ్ఛామి- నేను బుద్ధుడి శరణులోకి వెళుతున్నాను. ద్ధమ్మం శరణం గచ్ఛామి- నేను ధర్మం శరణులోకి వెళుతున్నాను. సంఘం శరణం గచ్ఛా మి-నేను సంఘం శరణలోకి వెళుతున్నాను-అంటూ తధాగత భగవాన్‌ అర్హంత్‌ సమ్యక్‌ సంబుద్ధకు నమస్కరించు కుంటారు.
వైదిక మతస్థులు తమ ధర్మాన్ని తాము ప్రచారం చేసుకోవచ్చు. కానీ, అది అంత సులభమైన పనిగా అనిపించ లేదు. అప్పటికే ఆసియా దేశాలన్నింటా బౌద్ధం బలంగా నాటుకుపోయింది. దాన్ని నాశనం చేసి, ఆ స్థానాన్ని ఆక్రమించాలన్న కుట్రలో భాగంగానే బౌద్ధ విగ్రహాల్ని, బౌద్ధారామాల్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని వాటి రూపు రేఖలు మార్చి, వారి ఇష్ట ప్రకారం కల్పిత దేవీ దేవతల దేవాలయాలుగా ప్రచారం చేశారు. వారి జీవనాధారం వారు చూసుకున్నారు. పాలి, ప్రాకృత భాషల్ని మరుగుపరిచి, సంస్కరిచబడ్డ తమ సంస్కృతానికి ప్రాధాన్యమిచ్చుకున్నారు. పైగా ఆ భాష తమ పురోహిత వర్గంలో మాత్రమే ఉండే విధంగా కట్టుదిట్టం చేసుకున్నారు. బౌద్ధంలోని పదాలు వేరు, వైదిక మతస్థులు మార్చుకున్న అర్థాలు వేరు. ఆ రెండూ ఒకటేనేమో అని చాలామంది పొరబడుతున్నారు. ఉదాహరణకు ధమ్మపదంలోని ధమ్మం వేరు. మూలకాల కలయికతో ఏర్పడే రసాయనిక ధర్మం వేరు. ‘ధర్మం చెయ్యి బాబూ!’ అని అర్థించడంలోని ధర్మం వేరు. ఆలోచించగల వారికే ఆ తేడా తెలుస్తుంది. బౌద్ధంలో జ్ఞానోదయం పొందిన దివ్యుల్నే-‘దేవతలు’ అంటారు. వైదికులు ఊహించుకున్న వారిని దేవతలు-అని అంటారు. అక్కడ జ్ఞానంతో పని లేదు. వారి దేవతలకు మహిమలుంటాయని భావిస్తారు.
వైదిక మత విరోధి అయిన బుద్ధుణ్ణి, సాధారణ శకం ఏడవ శతాబ్దం తర్వాత మెల్లెగా వైదికులు తమ దశా వతారాల్లో కలుపుకున్నారు. సా.శ:. 8వ శతాబ్దంలో శంకరాచార్య తన ‘దశావతార స్తోత్రం’లో బుద్ధుణ్ణి యజ్ఞ విరోధిగా వర్ణించారు. విష్ణు సహస్ర నామాల్లో 782-806 మధ్య 24 పేర్లు బుద్ధుడికి సంబం ధించినవే. వీటిలో బుద్ధుణ్ణి అహింసావాదిగా యజ్ఞాల్ని నిరసించిన వాడిగానే చెప్పారు. శ్రీనాధుడి శృంగార నైషధంలో, ముద్దు పళని – రాధికా స్వాంత నంలో; జయదేవుడి అష్టపదుల్లో బుద్ధుడు జీవకారుణ్య మూర్తిగా – యజ్ఞ విరోధిగానే వర్ణించబడ్డాడు. ఇక బ్రాహ్మణుడికి వైదికులు ఇచ్చుకున్న అర్థం వేరు. బౌద్ధం చెప్పిన అర్థం వేరు. జన్మ వల్లనో, గోత్రం వల్లనో, లేక వివిధ రకాల జడలు, పిలకలు ధరించినందువల్లనో ఎవరూ బ్రాహ్మణులు కదు. సత్యం పలికేవారు, ధర్మాన్ని ఆచరించేవారు, మనో వాక్కాయ కర్మలందు శుచీ, శభ్రత గలవారు మాత్రమే బ్రాహ్మణులు – అని ధమ్మపథంలోని ఒక గాథ చెపు తుంది. బౌద్ధం ప్రకారం శీల సంపదగలవాడే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ ‘కులం’లో పుట్టినవారు కాదు. మనుశాస్త్రం లోని-కుల వ్యత్యాసాల్ని-పురుషాధిపత్యాన్ని, శూద్ర కులాల బానిసత్వాన్ని, అస్పృశ్యతను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించారు.
వజ్రయాన కాలంలో రాజులు బుద్ధుణ్ణి బౌద్ధ భిక్షువుగా కాకుండా, ఆయన యువరాజుగా ఉన్నప్పటి శిల్పాలను చెక్కించారు. ఆయనకు ‘అవలోకేతేశ్వర’ అని నామకరణం చేశారు. ఆ అవలోకేతేశ్వర విగ్రహాలే చాలా హిందూ దేవీదేవతలుగా మార్పుచెందాయి. బుద్ధుని నైతిక ధర్మాన్ని నాశనం చేయడం కోసం బ్రాహ్మణార్యులు ఉద్దేశ పూర్వకంగా శివుడు, కృష్ణుడు వంటి పాత్రలు సృష్టించి, విటితో అసభ్యకరమైన కథలల్లి బుద్ధుణ్ణి అవమాన పరిచారు విషయం లోతుగా అర్థం చేసుకోవాలంటే, ఎవరికైనా సరే సహనం, సంయమనం అవసరమౌతాయి. ల-రలతో తమిళంలో అసలు మాటలు లేవు. లంక-రావణ వంటి పదాలు ద్రావిడ సంస్కృతిలో లేవు. అవి ఉత్తర భారతదేశం నుండి వచ్చినవి. పుష్యమిత్రుని దృష్టిలో ఉంచుకుని రాముడి పాత్రను సృష్టించారు. అశోకుడి రాజ భవనాన్ని దృష్టిలో ఉంచుకుని రావణుడి భవనానికి రూపకల్పన చేశారు. మౌర్యుల రాజమందిరం అగ్నికి ఆహుతి కావడం, అందుకు సంబంధించి ఆధారాలు దొరకడం వల్ల ఆంజనేయుడి లంకా దహనాన్ని సృష్టించారు. ఇక ఆంజనేయుడు తన తోకతో లంకను తగులబెట్టాడని చెపుతున్నవన్నీ ‘బౌద్ధ చైత్యాలు’! మరి ఆంజనేయుడనే కల్పిత పాత్ర బౌద్ధ చైత్యాన్ని తగుల బెట్టడం రామాయణంలో ఎందుకుందీ?- అన్న ప్రశ్నవేసి తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఏది ముందూ? ఏది తర్వాత కాలానిదో అక్కడే దొరికిపోతోంది. ఇక తమ మనోభావాలకు దెబ్బలు తగిలించుకుని బొబ్బలు పెట్టేవారిని చూసి మనం జాలిపడాలి. ”భగవద్గీతను సాధారణ శకం 150-350 జ.జు మధ్యకాలంలో రచించి ఉంటారు! దీన్ని భారతంలో జొప్పించి కృష్ణునితో చెప్పించారు”-అవి ప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు డి.డి.కోశాంబి నిర్ధారించారు.
ఈ దేశం బౌద్ధ దేశంగా ఉన్నందు వల్ల, అహింసా సిద్ధాంతం పాటించడం వల్ల, యుద్ధాలకు వెనకాడి, ఈ దేశ ప్రజలు దేశాన్ని విదేశీ పాలకులకు అప్పగించారని వైదికులు ఒక పుకారు పుట్టించారు. అసలు కారణం అది కాదు ఈదేశంలో మనువాదులు ప్రవేశపెట్టిన వర్ణవ్యవస్థ వల్ల యుద్ధం చేసే అర్హత అందరికీ ఉండేది కాదు.కేవలం క్షత్రి యులకు మాత్రమే ఉండేది. ఒక్కోసారి తగినంత మంది క్షత్రియులు లేక, సైన్యం బలహీనపడేది. అదీగాక, స్వీయ రక్షణ కోసం చేసే యుద్ధాన్ని బుద్ధుడు కాదనలేక, అందువల్ల ఈ విషయంలో తప్పు బుద్ధుడిది బౌద్ధానిదీ కాదు. అంద రికీ సమానమైన అవకాశాలివ్వని వర్ణవ్యవస్థదే- తప్పు- పరిస్థితులు మారి, తర్వాత కాలంలో సైన్యంలో చేరే అవకాశం అందరికీ రావడంతో భారత సైన్యాలు బలపడ్డాయి. ఈ విషయాన్ని అంబేద్కర్‌ కూడా తన రచనల్లో చర్చించారు.
-సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త-మెల్బోర్న్‌ నుంచి

– డాక్టర్‌ దేవరాజు మహారాజు