న్యూయార్క్: టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగులపై ఉద్వాసనలు ఆగడం లేదు. మరో దశ తొలగింపులకు తెగబడింది. తాజాగా ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ బృందాలు, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో కంపెనీ కొలువుల కోతకు పాల్పడింది. తొలగింపుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయి నందుకు చింతిస్తున్నామని గూగుల్ పేర్కొనడం గమనార్హం. సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని బాధిత ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఆ కంపెనీ తెలిపింది. అర్హులైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని హామీ ఇచ్చింది. వేటుకు గురైన ఉద్యోగులు ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు తిరిగి దరఖాస్తు చేసుకోచ్చని సూచించింది. కంపెనీలో తిరిగి అవకాశం దక్కని సిబ్బంది ఏప్రిల్‌లో సంస్థను వీడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు దాదాపు 2.60 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. కొత్త ఏడాది 2024లోనూ ఇదే ప్రక్రియ కొనసాగడంతో టెకీలు తీవ్ర ఆందోళన నెలకొంది.