సంతృప్తికరం కాదు!

సంతృప్తికరం కాదు!–  కేప్‌టౌన్‌ పిచ్‌కు రిఫరీ రేటింగ్‌
దుబాయ్ : సర్వత్రా ఆసక్తి రేపిన కేప్‌టౌన్‌ పిచ్‌ రేటింగ్‌ వచ్చేసింది. భారత్‌, దక్షిణాఫ్రికా న్యూఇయర్‌ టెస్టు మ్యాచ్‌ పిచ్‌ను ‘సంతృప్తికరం కాదు’ అంటూ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ రేటింగ్‌ ఇచ్చారు. ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే రెండు రోజుల్లోనే (ఐదు సెషన్లు) ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 642 బంతుల ఆట మాత్రమే సాధ్యపడింది. పిచ్‌ నుంచి సీమ్‌, అనూహ్య బౌన్స్‌ను రాబట్టిన పేసర్లు వికెట్ల జాతర సాగించారు. ఇరు జట్ల నుంచి ఒక్క బంతి స్పిన్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు. ‘న్యూలాండ్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు ఎంతో కష్టంగా సాగింది. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయ్యింది. కొన్ని సందర్భాల్లో బౌన్స్‌ ప్రమాదకరం అనిపించింది. బ్యాటర్లు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. చాలా మంది బ్యాటర్లకు బంతి గ్లౌవ్స్‌కు తగిలింది. అనూహ్య బౌన్స్‌తోనే ఎక్కువ వికెట్లు పడ్డాయి’ అని క్రిస్‌ బ్రాడ్‌ తన పిచ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సంతృప్తికరంగా లేదనే రేటింగ్‌తో కేప్‌టౌన్‌కు ఓ డీమెరిట్‌ పాయింట్‌ సైతం జరిమానా వేశారు. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రేటింగ్‌పై అప్పీల్‌ చేసేందుకు క్రికెట్‌ దక్షిణాఫ్రికా సుముఖంగా లేదని సమాచారం. పిచ్‌ రిపోర్టుపై సంతృప్తికరంగా ఉన్నామని ఓ అధికారి తెలిపారు.