ఆరు కాదు.. మరెన్నో..

Not six.. many more..– తొలి ఏడాదిలోనే మార్పునకు శ్రీకారం
– గ్యారంటీలకు మించిన ప్రజోపయోగ పనులు
– నిరంతరం సీఎం సమీక్షలు, సమావేశాలు
– రోజుకో వినూత్న ఆలోచనతో అడుగులేసిన ప్రజా ప్రభుత్వం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆరు నూరైంది.. మార్పు మొదలైంది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నూటికి నూరు పాళ్లు నిలబెట్టుకుంది. తొలి ఏడాది లోనే సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టింది. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివద్ధికి నిరంతరం సమీక్షలు… సమావేశాలు నిర్వహించారు. కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే పరిమితం కాకుండా దాదాపు 160 వినూత్న కార్యక్రమాలను సర్కారు చేపట్టింది. ప్రజా సంక్షేమం… అభివద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్‌ రోజుకో వినూత్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. పదేండ్ల విధ్వంసపు ఆనవాళ్లను చెరిపేసి తెలంగాణ పున:వైభవాన్ని కొనసాగిస్తూనే.. అన్ని రంగాల్లో రాష్ట్ర సమగ్ర అభివద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణను ‘ది ఫ్యూచర్‌ స్టేట్‌గా’ హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం తొలి ఏడాదిలోనే ఫలితాలను సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతో ప్రజా ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టడం విశేషం. జాతీయ స్థాయిలో కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్‌ ఫోర్స్‌ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది 2023 జులై నుంచి సెప్టెంబర్‌ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే, ఈ ఏడాది 2024 జులై నుంచి సెప్టెంబర్‌ వరకు 18.1 శాతానికి చేరింది. విడుదల చేసిన ఈ వానాకాలంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తే, 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కావటం విశేషం. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశమంతా ఆకర్షించింది. దేశాభివద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవలే కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీస్‌(సీఐఐ) వెల్లడించింది. జీఎస్డీపీ వద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉందనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రూ.15.52 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు గత ఏడాది డిసెంబర్‌ నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 వివిధ అభివద్ధి, సంక్షేమ వినూత్న పథకాలన్నీ వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి.