– సార్వ్తతిక సమరంలో గెలుపు ఏకపక్షం కాదు
– అధికారపార్టీకి పలు రాష్ట్రాల్లో ప్రతికూలతలు
– పుంజుకుంటున్న ఇండియా కూటమి
న్యూఢిల్లీ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని కార్పొరేట్ మీడియా సంస్థలు గత కొంత కాలంగా ఊదరకొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు చోటుచేసుకున్నాయంటూ ఆ సంస్థలు వార్తలు వండి వారుస్తున్నాయి. అయితే వాస్తవాలను పరిశీలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడక కాబోదని అర్థమవుతోంది. అందుకే.. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై బీజేపీ అంతగా ఆధారపడాల్సి వస్తోంది.
అసమ్మతి…అసంతృప్తి
అనేక రాష్ట్రాల్లో పార్టీ నేతల దుందుడుకు వైఖరులు, పోకడలు, వారి వ్యవహార శైలి సామాన్య కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మోడీ నేతృత్వంలోని బీజేపీకి కీలకమైన కొన్ని హిందీ రాష్ట్రాల్లో ఈ వాతావరణం కన్పిస్తోంది. అనేక లోక్‌సభ స్థానాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిర్ణయించడం బీజేపీకి కష్టంగా ఉంది. బీజేపీకి గొప్ప విజయాలు లభిస్తాయని పలు సర్వేలు చెబుతున్న రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి కన్పిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో 179 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో సైతం స్థానిక పార్టీ నేతలపై అసమ్మతి వ్యక్తమవుతోంది. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు బీజేపీకి చెందిన వారే. ఆ రెండు రాష్ట్రాల్లో 15 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కమలదళం ప్రతిపక్షాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మరోవైపు బీజేపీ శిబిరంలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుగుబాటే దీనికి ఉదాహరణ. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో మోడీ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కేంద్రంలో అంతా తామై వ్యవహరిస్తున్న నాయకద్వయంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు అసంతృప్తిగా ఉండడం రహస్యమేమీ కాదు.
ఇంకేం పెరుగుతుంది?
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. అక్కడ 48 లోక్‌సభ స్థానాలు ఉండగా అధికార కూటమి సగం సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నదని అంచనా. 28 స్థానాలు ఉన్న కర్నాటకలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. గత మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో సంస్థాగతంగా బీజేపీ బలహీనపడింది. అందరికీ ఆమోదయోగ్యమైన నేత లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటకలో కలిపి 270 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అంటే లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో సగం సీట్లు ఈ రాష్ట్రాలలోనివే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఉన్న 179 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ సుమారు 80-90శాతం సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఈ బలం మరింత పెరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు కూడా బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల బలం పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ గరిష్ట స్థాయిలో లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఎత్తుగడలు పన్నినా దాని బలం అంతకంటే పెరిగే అవకాశాలు లేనేలేవు. బీజేపీ నాయక ద్వయానికి ఇదేమీ తెలియనిది కాదు. అందుకే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అంత ప్రాచుర్యం. ప్రజల్లో మతపరమైన భావేద్వేగాలను కలిగించడానికే ఈ ప్రయాస.
జోష్ నింపనున్న రాహుల్ యాత్ర
దళిత నేత మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడుగా, ఇండియా కూటమి ఛైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో సైతం ఆయన దళిత ఓటర్లపై ప్రభావం చూపుతారని, తద్వారా ఇండియా కూటమి బలం పెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రారంభించిన భారత్ జోడో న్యారు యాత్రకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. ఈ యాత్ర ద్వారా లోక్‌సభ స్థానాలు అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమి బలపడుతుందని అంచనా. సీట్ల సర్దుబాటు విషయంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయబేధాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీకే పరిమితం. ఇది ఇండియా పక్షాల ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపబోదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు ఎన్నికల కమిషన్ కూడా తన వంతు కృషి చేస్తోంది. ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని ఈసీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక బీజేపీకి ఉన్న అపార ఆర్థిక వనరులను గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. బీజేపీకి, మోడీకి ప్రధాన మీడియా వంత పాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ ప్రతిపక్ష ఇండియా కూటమికి ప్రతికూలతలే అయినప్పటికీ రాబోయే ఎన్నికల పోరు మాత్రం ఏకపక్షం కాబోదన్నది నూటికి నూరు పాళ్ల నిజం.