– ఈ ఎన్నికలు అధికార పార్టీకి కష్టమే
– అయినా విజయం తమదేనంటూ విశ్వాసం
– ప్రచారంలో మాత్రం ఎదురీత
– క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు
– కాషాయపార్టీకి వ్యతిరేకంగానే ప్రజలు
– అయినా..’మోడీ కరిష్మా’ అంటూ ప్రగల్భాలు : ఎన్నికల విశ్లేషకులు, నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ : ఎన్నికలు వస్తే ఏ పార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తాం? ఎలా చేస్తాం? అనే విషయాలను వివరిస్తూ ముందుకు వెళ్తాయి. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. ‘వ్యక్తి’ ప్రతిష్టను మాత్రమే నమ్ముకున్నది. లోక్‌సభ ఎన్నికల్లో అదొక్కటే విజయం కలిగిస్తుందని ముందుకెళ్తున్నది. ప్రధాని మోడీకి ఇప్పటికీ ప్రజల్లో విపరీతమైన జనాదరణ ఉన్నదనీ, ఆ కరిష్మాతోనే లోక్‌సభ ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చనే అతి విశ్వాసంలో కాషాయ పార్టీ ఉన్నది.బీజేపీకి స్వంతంగా 370 సీట్లు, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని మోడీ, బీజేపీ అధినాయకత్వం, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రచారం చేసుకుంటు న్నారు. ‘మోడీ కరిష్మా’ ఒక్కటి చాలని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే, ఆ పార్టీ ఇంత చెప్తున్నా.. ఎన్నికల్లో మాత్రం ఎదురీదుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాషాయపార్టీ చెప్పుకుంటున్నట్టుగా కాక, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనీ, ప్రజలు ఆ పార్టీపై, మోడీ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్తున్నారు. బీజేపీ శ్రేణులు ఇంటా, బయట మోడీకి విపరీత ప్రచారం కల్పించి, ఆ అతివిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాయనీ, ఇది ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించక మానదని విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. దక్షిణాదిలో మోడీకి కరిష్మా ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మణిపూర్ పరిస్థితులు దేశవ్యాప్తంగా మైనారిటీల్లో తీవ్ర భయాందోళనలు తీసుకొచ్చాయనీ, దాని ప్రభావంతో ఆ వర్గాలలో కాషాయపార్టీకి ఉన్న అతి తక్కువ ఓటు బ్యాంకు కూడా దారుణంగా పడిపోయే
నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగలనున్నదని హెచ్చరిస్తున్నారు. రాజకీయమైనా, సినిమా రంగమైనా.. ఒక వ్యక్తికి ఉన్న ఆదరణ కొంత కాలం వరకేననీ, అదే ఎప్పుడూ పని చేస్తుందనుకోవటం తెలివి తక్కువ తనం అవుతుందని కొందరు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయం మోడీకి కూడా తెలుసుననీ, అందుకే కొన్ని సున్నితమైన అంశాలను తాకుతూ, ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని రాజకీయాలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, దక్షిణాదిపై దృష్టి పెట్టిన ఆయన.. కచ్చతీవు, లక్షద్వీప్ వంటి అంశాలను వాడుకున్నాడని వారు ఉదహరిస్తున్నారు. నాయకుడు అసమర్థుడైనపుడు మాత్రమే ఇలా భావోద్వేగ అంశాలను ముందుకు తీసుకొచ్చి, ప్రజలు ఓట్లతో లబ్ది పొందాలని చూస్తారని ప్రతిపక్ష పార్టీల నాయకులు కొందరు అంటున్నారు.
సుప్రీంకోర్టు ద్వారా అపఖ్యాతి పాలైన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సమర్థించిన మోడీ.. సెల్ఫ్ గోల్ చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు తప్పుబట్టిన అంశాన్ని ప్రధాని స్థాయి వ్యక్తి ఎలా సమర్థిస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణం వంటి అంశాలనూ బీజేపీ ముందు పెట్టి ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నదని అంటున్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకత వస్తున్నదనుకున్న సమయంలో, ఎన్నికల బాండ్ల వంటి కొన్ని అంశాలను మరుగున పెట్టే ఉద్దేశంతో రాజకీయ నాయకుల అరెస్టులకు తెర తీసిందనీ, ఇందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకున్నదన్న రాజకీయ నాయకుల మాటలను విశ్లేషకులు ఉటంకిస్తున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న హేమంత్ సొరెన్, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అయితే, బీజేపీతో అంటకాగుతున్న పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై మాత్రం బీజేపీ నోరు మెదపటం లేదనీ, ఇది కాషాయపార్టీ వాషింగ్ మెషిన్ రాజకీయానికి తార్కాణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.