ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బార్సు అనేది ట్యాగ్ లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈచిత్ర టీజర్‌ను సామాన్యులే సెలబ్రిటీలుగా ఆటో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మోటార్ మెకానిక్, వెయిటర్, కూలీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. ప్రేక్షకుల మనసుల్ని కదిలించే చిత్రమిది’ అని అన్నారు.
‘అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ మూవీ ఇది. మీరు టీజర్‌లో చూసింది కొంతే. సినిమాలో ఇంకా చాలా కంటెంట్ ఉంది’ అని మరో నిర్మాత బసవరాజు లహరిధర్ చెప్పారు. హీరో ధర్మ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కిరణ్‌కి, నిర్మాతలకు థ్యాంక్స్. టైటిల్ చూసి ఇది యూత్‌ను చెడగొట్టే సినిమా అనుకోకండి. మంచి లవ్ స్టోరీ ఉంది. అలాగే మీకు నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి’ అని తెలిపారు. ‘టీజర్ చూసి నెగటీవ్‌గా ఉందని ఫీలైన వాళ్ళు, థియేటర్‌లో సినిమా చూస్తే మంచి సినిమా చేశాడని నన్ను ప్రశంసిస్తారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాని చూడబోతున్నారు’ అని దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు.