– నెతన్యాహుపై ఇజ్రాయిలీ ప్రజల ఆగ్రహం
– లక్షన్నర మందితో భారీ ర్యాలీ
టెల్ అవీవ్: గాజాలో జరుగుతున్న మారణహోమం నుంచి ఇజ్రాయిల్ వెనక్కి తగ్గేది లేదని ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించడంతో ఇజ్రాయిల్ ప్రజలు భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. 37వేల మందిని అమానుషంగా పొట్టనపెట్టుకున్న నెతన్యాహు ఇంకా నీ రక్త దాహం తీరలేదా అంటూ వారు నినదించారు. ఆదివారం టెల్ అవీవ్‌లో పెద్ద సంఖ్యలో గుమికూడిన ఇజ్రాయిలీ ప్రజలు నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ కాదు, క్రైమ్ మినిస్టర్ అన్న బ్యానర్‌తో ర్యాలీ నిర్వహించారు. లక్షన్నర మంది దాకా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. నెతన్యాహు అంత చెత్త ప్రధానిని తానెన్నడూ చూడలేదని భద్రతా దళ మాజీ అధిపతి ఇవాన్ డిస్కిన్ అన్నారు.మనవడి భవిష్యత్తు కోసం తాను ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వచ్చానని ఆయన తెలిపారు.నెతన్యాహు ప్రభుత్వాన్ని పడగొట్టక పోతే తమకే కాదు, తమ పిల్లలకూ భవిష్యత్తు ఉండదని 66 ఏళ్ల పారు ఎరెల్ అన్నారు. నెతన్యాహు హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతోందంటూ టెల్ అవీవ్‌లోని డెమొక్రసీ స్క్వేర్‌కు ఎర్ర రంగు పులిమి నిరసన తెలిపారు. నెతన్యాహు తక్షణమే గద్దె దిగి, ఇజ్రాయిల్ పార్లమెంటుకు ఎన్నికలు జరపాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. గాజాపై దాడులను ఆపాలని కూడా వారు డిమాండ్ చేశారు. హమాస్ చేతిలో బందీలుగా చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.