రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న లైంగికదాడులు, లైంగికదాడి బాధితులు, వెల్లువెత్తిన ప్రజాగ్రహం, పోలీస్ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్ల చుట్టూ తిరిగిన నవల ఇది. పురుషాధిక్యతతో పాటు తాగుడు, డ్రగ్స్ తీసుకోవడం, మహిళలపై లైంగిక దాడులకు కారణం అవుతున్నాయి. యువతులే కాదు. పసిపిల్లలు, ముసలి వాళ్లు కూడా బాధితులే. లైంగికదాడి అంటే బలవంతాన కోరిక తీర్చుకోవడం మాత్రమే కాదు, కక్ష తీర్చుకోవడం కూడా. ‘పుడమి’ మతదేహానికి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె పక్కటెముకలు నుజ్జు నుజ్జు అయి ఉన్నాయి. ‘అభయ’ ఘటనలో ఇంకా ఘోరంగా చిత్రవధ చేసి చంపారు. వాళ్లలో ఇంతటి రాక్షసత్వం ఎలా చోటుచేసుకుందో తెలియదు. అగ్రవర్ణ స్త్రీలపై ఇటువంటి దాడులు జరిగితే తక్షణ స్పందన, ఆందోళనలు జరగడం మామూలే. అదే అట్టడుగు కులాల స్త్రీలకు జరిగితే మాత్రం.. వాళ్లకి మామూలే అని కొట్టి పారేయడం జరుగుతున్నది. లైంగిక దాడి చేసిన వాళ్లను ఎన్కౌంటర్ చేయాలని వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక.. పోలీసులకు అసలైన నేరస్తులు దొరకక, దొరికిన వాళ్లను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకుంటారు. వాళ్లు చంపిన వాళ్లలో ఉన్న చంటి అనే కుర్రాడు మైనర్ అని, పదిహేనేళ్లు అని దానికి తగిన ఆధారాలు ఉన్నాయని వాదించే తండ్రి హఠాత్తుగా ఆక్సిడెంట్లో పోవడం వెనక ఉన్న మర్మమేమిటి? కాల్పుల్లో చనిపోయిన నలుగురు నిందితులు అసలు నేరస్తులు కాదు అంటే అసలు నేరస్తులు వేరన్న మాట. అసలు నేరస్తులు ఎవరు, ఎలా వెంటాడి ఖతం చేశారో తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే. సిద్ధాంతి, బాబాలు ఆశ్రమం మాటున కొనసాగించే బలత్కార పర్వాలతో పాటు, వారి అనుచర వర్గం కొనసాగించే లైంగికదాడులు ఎంత పకడ్బందీగా సాగుతూ ప్రజల్ని హడలెత్తిం చాయో ఇందులో విపులంగా వివరించారు. లైంగికదాడులు, చిత్రహింసలను హదయ విదారకంగా చెప్పినా, వ్యంగ్యం మాటున ఆ బీభత్సాన్ని తట్టుకోవడానికి పాఠకున్ని సంసిద్ధం చేయడంలో రచయిత చేసిన కషి ప్రశంసనీయం.
– కె పి అశోక్ కుమార్