”అయినా… మనిషి మారలేదు… ఆతని కాంక్ష తీర లేదు” ఎర్రకోట బురుజుల నుండి మోడీ ఉపన్యాసం విన్నవారికి గుండమ్మ కథలోని పై పాట గుర్తుకురాక మానదు. ”కడిగిపారేయడానికి” 98 నిమిషాలు వాడుకున్నాడని మోడీని ఆకాశానికి ఎత్తిన ఒక సంపాదక ‘మాన్యుడు’ సెంచరీ మిస్ చేసినందుకు ‘అభిమానుల’ తరఫున ఒకింత వగచాడు. ఈ ప్రహసనాన్ని చూసిన ఎవరైనా ఆశ్చర్యపోకమానరు. ఎందుకంటే ఎర్రకోట ఉపన్యాసంలో ”కడిగిపారేసిన”దానికంటే కప్పిపెట్టేసినవే ఎక్కువ.
సుమారు పాతికేళ్ల సరళీకృత ఆర్థిక విధానాల అమలు తర్వాత, మిగతా దేశాల్లాగే మన దేశంలోనూ ప్రజల్లో అసంతృప్తి విస్తరిస్తున్న దశలో దాన్ని కంట్రోల్ చేయగల శక్తిమంతుడు కావాలి. దాంతోపాటు దేశ కార్పొరేట్ల సేవలో తేడా రాకుండా చూడాలి. ‘సరైన’ సమయంలో ‘సరైన’ వ్యక్తిని ఆరెస్సెస్ తన అంబులపొదిలో నుండి దేశం మీదికి వదిలింది. దశాబ్దంకిపైగా భారత గుత్త పెట్టుబడికి ముద్దుబిడ్డగా సాకబడి, ట్రయిన్ చేయబడ్డ వ్యక్తిని గుజరాత్ నుండి ఢిల్లీకి దిగుమతి చేసుకున్నారు. ఆ విధంగా ప్రారంభమైన మోడీ ప్రస్థానంలో.. మొన్న స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోట నుండి పదకొండవసారి మారుమ్రోగిన ఉపన్యాసం గురించే నేటి చర్చంతా!
మొన్నటి లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీని పరిస్థితులు మార్చేస్తాయని ఆనందించిన అల్ప సంతోషులున్నారు. ఒక చంక కింది పోటీ కర్ర తెలుగుదేశమని, మరో చంక కింద జేడీ(యూ) కర్ర ఉందని, ఈ రెండూ ‘సెక్యులర్ పార్టీలనీ మోడీ ఆటలు సాగనీయరని చప్పట్లు కొట్టినవారున్నారు. కానీ ఎటువంటి శషభిషలకు తావు లేకుండా ఆరెస్సెస్ ఎజెండాను తన ఎర్రకోట ఉపన్యాసంలో జాగ్రత్తగా ప్రస్తావించారు ఈ ఆరెస్సెస్ మాజీ ప్రచారక్.
మోడీ కప్పిపెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా విప్పిచూస్తే.. ఇప్పటిదాకా దేశంలో ఉన్నది మతతత్వ సివిల్ కోడ్ అట! ఆ మాట సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుందట! అది ఎప్పుడో, ఎక్కడో ఆయన చెప్పరు. పైగా నేషనల్ లా కమిషన్ తన 21వ సంప్రదింపుల పత్రంలో వివక్షపూరితంగా ఉన్న చట్టాలను సరిచేస్తే చాలని, ఉమ్మడి పౌరస్మృతి అవసరం నేడు లేదని స్పష్టంగా చెప్పింది. దీని గురించి మోడీ చెప్పరు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అమల్లోకొచ్చిన ముస్లిం మైనారిటీలపై సాగే వివక్షపై ఆయనేమీ చెప్పరు. దాని స్థానంలో లౌకిక సివిల్ కోడ్ తెచ్చే పనిలో తన సర్కారుందట! తాను తేదల్చుకున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’కే చ్కెర పూసి ఎన్డీయే కూటమి భాగస్వాములతో మింగించే ప్రయత్నం చేయడమే కదా ఇది!? తరచూ ఎన్నికలు జరిగితే దేశాభివృద్ధికి అడ్డంకి కాబట్టి, లోక్‌సభకూ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారట! ఒకే దేశం, ఒకే ఎన్నికలు నినాదాన్ని ఈ విధంగా చెప్పారు మోడీ. ఇది భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల మీదే గొడ్డలివేటు. పెట్టుబడిదారుల ప్రాపకంతో బతికే పార్టీలకు, మొన్నటి ఎలక్టోరల్ బాండ్లలో వేల కోట్లు పోగేసుకున్న పార్టీలైతే పంచాయతీల నుండి లోక్‌సభ సీట్ల వరకు పోటీ చేసే స్తోమతుంటుంది. తప్ప మిగిలిన వారికి అసాధ్యం. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల్లో పార్టీలు చీలిపోతూంటాయి. ప్రభుత్వాలు కూలిపోతూంటాయి. ‘ఒకే ఎన్నిక’ అంటే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలను స్థిరంగా నిలబెట్టేస్తారా? ఓనం కాలంలో కేరళలో, దుర్గాపూజా కాలంలో దేశ తూర్పు భాగంలో, దసరా, సంక్రాంతి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించగలరా? దేశం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు భారతదేశంలో నిర్వహించడం అసాధ్యం.
మోడీ అవినీతిపై పోరాడుతున్నారట! దేశం ఆయన వెంట నడవాలట! వాస్తవమేమంటే అవినీతి మరకలున్న వారు బీజేపీలో చేరితే పరిశుద్ధులౌతున్నారు. చాంతాడంతున్న ఈ లిస్టు చూసి దేశం నవ్వుకుంటోంది. మోడీ ”అవినీతి వ్యతిరేక” పోరాటం దాంతో ఆగలేదు. ఎన్నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు – కూలిపోతున్న టన్నెల్స్, విరిగిపడుతున్న విమానాశ్రయాలు, కొట్టుకుపోతున్న జాతీయ రహదారులు, లీకవుతున్న కొత్త పార్లమెంటు, అయోధ్య రామమందిరం వంటివి ఎన్నో ఉన్నాయి. ఇదంతా అవినీతి వల్ల కాదా మోడీ మహాశయా? మీరు పోరాడేది ఏ అవినీతి మీదో దేశ ప్రజలకు చెప్పగలరా? అదానీకి వ్యతిరేకంగా జరిగే ఏ వ్యవహారమైనా విదేశీ కుట్రలో భాగమేనన్న మోడీ సెబీ చీఫ్‌పై ఈగ వాలకుండా చూసుకోమని చెప్పడం దాన్ని మన సంపాదక పెద్ద రాయడం ఈయన మోడీ ఒళ్లోనే ఉన్నాడని చెప్పకనే చెప్పాడు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై రిగే దాడుల గురించీ, ఆలయాలపై దాడి గురించి మోడీ ప్రస్తావించిన అంశాలు కచ్చితంగా దేశ ప్రజలందరూ మద్దతు నివ్వాల్సినవే. కాని మన దేశంలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలపై జరిగే దాడుల మాటేమిటి? కూలబడుతున్న చర్చీలు, మసీదుల మాటేమిటి? మాన్యశ్రీ సంపాదకుల వారు మోడీ శకంలో ఏ పొరుగు దేశంతో సుహృద్భావ సంబంధాలున్నాయో శెలవిచ్చి ఉంటే సంతోషించి ఉండేవారం. దేశంలో జరిగే విషయాలను పాఠకులకు వివరించడం పత్రికల ప్రధాన కర్తవ్యం. మరీ ముఖ్యంగా సంపాదకీయాల విధి. గోడీ మీడియాలో అంతర్భాగమైపోతే మరో కిరాయి రచయిత పెరిగారనుకోవడం తప్ప ఏం చేయగలం?