– అగమ్యగోచరంగా నిరుద్యోగుల భవిష్యత్
– 15 రాష్ట్రాల్లో 41 పరీక్షా పత్రాల లీకులు
– రీ-ఎగ్జామినేషన్‌లో తీవ్ర జాప్యం
– మానసిక క్షోభతో అల్లాడుతున్న ఉద్యోగార్థులు
– చట్టాలు, ఆర్డినెన్సులు ఫలితమిస్తాయా అని అనుమానాలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలకు పాల్పడుతున్న కేటుగాళ్లు నిరుద్యోగుల జీవితాలతో అటలాడుకుంటున్నారు. నెలల తరబడి పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీ పట్టి, నిద్రాహారాలు లేకుండా కష్టపడి చదివే వేలాది మంది నిరుద్యోగులు తీరా ఆ పరీక్ష పేపర్ లీక్ అయి, పరీక్ష రద్దయితే తీవ్రమైన ఒత్తిడికి, నిరాశా నిస్పృహలకు గురై ఆత్మహత్యకు సైతం పాల్పడుతూ తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్రాలకు మోడల్ ముసాయిదాగా ఉపకరిస్తుందని, అయితే అమలు విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరీక్షా పత్రాల లీకేజీపై ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక పరిశోధన జరిపింది. ఆ వివరాలు…
న్యూఢిల్లీ : గత ఐదు సంవత్సరాల్లో పదిహేను రాష్ట్రాల్లో పరీక్షా పత్రాల లీకేజీలకు సంబంధించి 41 ఆధారాలను ఈ పత్రిక సంపాదించింది. ఈ లీకేజీల కారణంగా 1.4 కోట్ల మంది నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. వారే కాదు…వారి కుటుంబాలు, తదుపరి బ్యాచ్‌ల అభ్యర్థులు కూడా ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ లీకేజీల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా అనేక రాష్ట్రాలకు సంబంధం ఉంది. ఉదాహరణకు రాజస్థాన్‌లో జరిగిన పేపర్ లీకేజీలలో కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నదని బీజేపీ ఆరోపిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాత్రపై కాంగ్రెస్ విమర్శలు సంధించింది. అయితే రాజస్థాన్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమి పాలయ్యాయి. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ లీకేజీలు సర్వసాధారణమయ్యాయి.
రద్దయితే అంతే సంగతులు
లీకేజీ కారణంగా పరీక్ష రద్దయిన సందర్భంలో దానిని మళ్లీ నిర్వహించేందుకు చాలా కాలం పడుతోంది. ఉదాహరణకు తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను 2022 అక్టోబర్ 16న నిర్వహించారు.
పేపర్ లీలైందని నిర్ధారణ కావడంతో పరీక్షను గత సంవత్సరం మార్చిలో రద్దు చేశారు. గత సంవత్సరం జూన్ 11న తిరిగి పరీక్ష నిర్వహించినప్పటికీ కొందరు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మళ్లీ రద్దయింది. దీంతో 503 పోస్టుల కోసం పోటీ పడిన 3.8 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకే ఇంత జాప్యం జరిగితే ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందోనని అభ్యర్థులు వాపోతున్నారు. కనీసం 15 సందర్భాల్లో పరీక్ష రద్దయిన సంవత్సరం తర్వాత కానీ దానిని తిరిగి నిర్వహించలేదు.
గుజరాత్‌లో 2019 నవంబరులో సుమారు నాలుగు వేల క్లర్కులు, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు ఆరు లక్షల మంది హాజరయ్యారు. అయితే ఆ పరీక్ష రద్దయింది. రెండు సంవత్సరాలకు పైగా వేచి చూసిన తర్వాత 2022 ఏప్రిల్‌లో తిరిగి పరీక్ష నిర్వహించారు. అసోంలో 597 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి 2020 సెప్టెంబర్ 9న పరీక్ష జరిపారు. పరీక్ష మొదలైన కొద్ది నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టడంతో దానిని రద్దు చేశారు. ఈ పరీక్షకు 66 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇలా అనేక రాష్ట్రాల్లో పరీక్ష రద్దయితే చాలు…తిరిగి నిర్వహించడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది.
చట్టాలు, ఆర్డినెన్సులు ఫలితమిచ్చేనా?
పోటీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకల కారణంగా పలు కుంభకోణాలు వెలుగు చూడడంతో అనేక రాష్ట్రాలు సొంతంగా చట్టాలు ూపొందించుకుంటున్నాయి. రాజస్థాన్‌లో 2021లో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష రద్దయింది. ఫలితంగా 12.67 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారు. లీకేజీతో సంబంధమున్న వంద మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. లీకేజీ వీరులకు పది సంవత్సరాల వరకూ జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధించేలా దీనిని రూపొందించింది. ఆస్తుల జప్తుకు కూడా వీలు కల్పించింది.
అయినప్పటికీ లీకేజీల జోరు తగ్గలేదు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం రాష్ట్రాలు కూడా గత సంవత్సరం చట్టాలు తీసుకొచ్చాయి. ఆర్డినెన్సులు జారీ చేశాయి.
లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే చట్టాలు చేస్తామని మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. అయితే కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ ఆమోదించిన చట్టాలు, జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రశ్నాపత్రాల లీకేజీలను ఏ మేరకు అడ్డుకోగలవో వేచి చూడాల్సిందే.
బాధ్యులపై చర్యలేవి?
తెలంగాణలో గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ల నియామకాలకు సంబంధించి నిర్వహించిన మూడు పరీక్షలను రద్దు చేశారు. కానీ ఇప్పటి వరకూ లీకేజీకి కారకులను అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. శాసనసభ ఎన్నికలు, ఇతర కారణాలతో పరీక్షల నిర్వహణ ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. హర్యానాలో గత సంవత్సరం జనవరి 15న జరిగిన ఉద్యోగ నియామక పరీక్ష కూడా లీకేజీ అనుమానాలతో రద్దయింది. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. రద్దయిన పరీక్షను తిరిగి నిర్వహించనూ లేదు.
పరీక్ష ఏదైనా ఒకటే…
కాదేదీ లీకేజీకి అనర్హం అన్నట్లు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష మొదలుకొని అసోం, రాజస్థాన్, కర్నాటక, జమ్మూకాశ్మీర్‌లో పోలీస్ నియామక పరీక్షల వరకూ… ఉత్తరాఖండ్‌లో అటవీ శాఖలో నియామకాల పరీక్ష నుండి తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్‌లో ఇంజినీర్ల నియామక పరీక్ష వరకూ… అన్నీ లీకేజీలే. అసోంలో పరీక్ష ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నాపత్రం వాట్సప్‌లో ప్రత్యక్షమైంది. రాజస్థాన్‌లో ఓ సర్కారు ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయం నుండి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడు. మధ్యప్రదేశ్‌లో పరీక్ష జరిగితే దాని నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ముంబయి ప్రైవేటు కంపెనీ సర్వర్లను నిందితుడు హ్యాక్ చేశాడు. మహారాష్ట్రలో సోషల్ మీడియాలో పేపర్ లీకైందంటూ ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.