– రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టేందుకు బీజేపీ కుట్ర : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బదులుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నోటీసులివ్వాలని ఢిల్లీ పోలీసులను సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కోరారు. కేంద్రం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలను ఇప్పటికే జైల్లో పెట్టారనీ, కొత్తగా రేవంత్ రెడ్డిని జైలులో పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఏదో పద్ధతిలో ఇబ్బందికి గురిచేస్తూ వారిని ఇరికించే ప్రయత్నం చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకుండా బీజేపీ కొత్త పన్నాగం పన్నుతోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారనీ, ఆయన్ను నియంత్రించేందుకే నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఇండియా కూటమి గిలిస్తే దేశానికి ప్రమాదమంటూ మోడీ చెప్పడం సరైంది కాదన్నారు. జాతి ఔన్నత్యానికి, లౌకికవాదానికి వ్యతిరేకంగా మోడీ, అమిత్ షా మాట్లడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే మోడీ పతనం మొదలవుతుందని చెప్పారు. ప్రధాని కక్షపూరితంగా వ్యవహారిస్తూ దిగజారి ప్రవర్తిసున్నారని నారాయణ ఈ సందర్భంగా విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత దిగజారిన ప్రధాని మరొకరు లేరన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండబోదనీ, హిట్లర్ తరహాలో నియంతృత్వ పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాబోదని అన్నారు. రాష్ట్రంలో ప్రమాదకర బీజేపీ ఎదిగేందుకు బీఆర్ఎస్ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.