– నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
– వాటి సమర్పణకు తుది గడువు ఫిబ్రవరి 12
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల (వీసీ) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా వీసీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించడం కోసం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల 12 సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని పేర్కొన్నారు. అర్హతలకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారానికి సంబంధించి షషష.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తు నమూనాతోపాటు బయోడేటా, అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను జతచేయాలని సూచించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పీఎస్‌టీయూ), డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ), జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్, కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ), మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ), తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ), పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)కు కొత్తగా వీసీలను నియమించనున్నట్టు వివరించారు. అయితే ఇందులో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నియమించిన వీసీలు కొనసాగుతున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి మాత్రం డి రవీందర్‌గుప్తాపై అవినీతి ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వాకాటి కరుణ ఇన్‌చార్జీ వీసీగా కొనసాగుతున్నారు. పది వర్సిటీలకు 2021, మే 22న వీసీలను నియమించిన విషయం తెలిసిందే. వారి పదవీకాలం ఈ ఏడాది మే 21న ముగియనుంది. దీంతో వీసీల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత వర్సిటీల వారీగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. వాటిని గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. ఆ తర్వాత వీసీలను ప్రకటిస్తుంది.