నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ, ప్రయివేటు పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ లోపల పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు కాపీలను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా నవంబర్ 11వ తేదీ లోపల కౌన్సెలింగ్ పూర్తి చేసి, అదే నెల 20వ తేదీ లోపల సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని తెలిపారు. అదే నెల 25వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు. పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సీట్ల కేటాయింపులో బైపీసీ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ బైపీసీ చదివిన విద్యార్థులు లేకపోతే, ఎంపీసీ చదివిన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు లేకపోతే, మిగిలిన కోర్సులు చదివిన విద్యార్థులకు సీట్లను అలాట్ చేస్తారు. దరఖాస్తు ఫార్మ్‌లను బోర్డు వెబ్‌సైట్ (https://tgpmb.telangana.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలు, కాలేజీలు, కోర్సుల వారీగా సీట్ల వివరాలను సైతం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అందుబాటులోకి 28 కాలేజీలు రాష్ట్రంలో 206 ప్రయివేటు పారామెడికల్ కాలేజీలుండగా, 40 ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 28 కాలేజీలు ఈ ఏడాదే నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కాలేజీలో రెండు కోర్సులను ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించారు. దీంతో మొత్తంగా 28 కాలేజీల్లో కలిపి 1,680 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో కలిపి ప్రభుత్వ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 3,122కు పెరిగింది. ప్రయివేటు పారామెడికల్ కాలేజీలు నాసిరకంగా తయారు కావడంతో, స్కిల్ ఉన్న పారామెడికల్ సిబ్బంది దొరకడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు అనుగుణంగా ఉండే కాలేజీల్లో చదివే విద్యార్థులకు, థియరీతో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం హాస్పిటల్స్‌లో మొదట్నుంచే ట్రైనింగ్ ఇప్పిస్తారు. దీనివల్ల విద్యార్థులకు స్కిల్ ఇంప్రూవ్ కావడంతో పాటు, కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌లో పారామెడికల్ విద్యార్థుల సేవలు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.