– 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– మే 9 నుంచి 12 వరకు రాతపరీక్షలు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (ఎంసెట్) నోటిఫికేషన్ ఈనెల 21న విడుదల కానుంది. మంగళవారం ఎప్‌సెట్ కమిటీ మొదటి సమావేశాన్ని హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, కోకన్వీనర్ కె విజయకుమార్‌రెడ్డి, కోఆర్డినేటర్లు ఎస్ తారాకళ్యాణి, ఎన్ దర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ఎప్‌సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. మే తొమ్మిది నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎప్‌సెట్ రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో వంద శాతం సిలబస్‌తో ఎప్‌సెట్‌ను నిర్వహిస్తామని డీన్‌కుమార్ స్పష్టం చేశారు.