ఇక మహిళల వంతు!

It's women's turn!– నేటి నుంచి టీ20 ప్రపంచకప్‌
– టైటిల్‌పై కన్నేసిన టీమ్‌ ఇండియా
నవతెలంగాణ-షార్జా
2024 టీ20 ప్రపంచకప్‌ విజయంతో భారత క్రికెట్‌ దశాబ్ది కాలం ఐసీసీ టైటిల్‌ నీరీక్షణకు సీనియర్‌ మెన్స్‌ జట్టు తెరదించింది. పొట్టి ప్రపంచకప్‌ విజయంతో రోహిత్‌సేన.. స్వదేశంలో క్రికెట్‌కు మరింత జోష్‌ తీసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికపై నిలకడగా రాణిస్తున్నా.. ఐసీసీ టైటిల్‌ అమ్మాయిలకు అందని ద్రాక్షగానే మిగిలింది. గతంలో ఫైనల్‌కు చేరుకున్నా.. విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. యుఏఈ వేదికగా జరుగుతున్న 2024 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్‌ అమ్మాయిల నుంచి టైటిల్‌ను లాగేసుకునేందుకు ఇంగ్లాండ్‌తో పాటు భారత్‌ సైతం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల పొట్టి ప్రపంచకప్‌ అక్కడి భద్రతా కారణాల రీత్యా యుఏఈకి తరలివచ్చింది. నేడు షార్జా వేదికగా బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ మ్యాచ్‌తో పొట్టి ప్రపంచకప్‌ షురూ కానుంది.
బరిలో పది జట్లు : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి పది జట్లు పోటీపడుతున్నాయి. టోర్నమెంట్‌ గ్రూప్‌ దశ, నాకౌట్‌ పద్దతిలో సాగుతుంది. గ్రూప్‌ దశలో పది జట్లు రెండు గ్రూపులుగా ఆడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు ఇతర నాలుగు జట్లతో ఓ సారి తలపడనుంది. గ్రూప్‌ దశ మ్యాచుల అనంతరం ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు నాకౌట్‌ దశకు చేరుకుంటాయి. గ్రూప్‌-ఏలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా సహా భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ఉండగా.. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ పోటీపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌ తొలిసారి తటస్థ వేదికపై జరుగుతుంది. యుఏఈ పిచ్‌లు, పరిస్థితుల ప్రకారం ఇక్కడ స్పిన్నర్లకు అనుకూలత ఎక్కువ. దీంతో భారత్‌ ఈసారి టైటిల్‌ సాధించేందుకు అవకాశాలు మరింత మెండుగా కనిపిస్తున్నాయి.