ఉదాసీనత..
నీ అపజయ హేతువు !
అడుగు అసలే కదలందీ
దారెట్ల దగ్గరైతది..!!
పని చేయంది
ఎక్కన్నైనా ఫలితముండది!
ఊరికే కూర్చుంటే
నీ ఉనికికే ప్రమాదం సుమా..!!
సంద్రమన్నాక
తప్పని అలజడులుంటరు !
జీవితమన్నాక
ఆటుపోటులు కల్లోలం చేస్తరు !!
తొవ్వ దొరికేదాకా
గట్టిగ ఉడుం పట్టు పట్టాలె
నడకాపితే నవ్వులపాలైతం!
చెమడోడ్చి చుక్కాని తిప్పాలె !!
గమ్యం..
మస్తు అల్కగనే అనిపిత్తది
దూరం కొండలు నునుపు బేటా!
అదొక అర్థంకాని పద్మవ్యూహం.
కాలయాపన ఒదిలి
అనుక్షణం అప్రమత్తంగ వుండాలె!!
అంతటా నెగలకపోతే
ఇంకెక్కడా నెగ్గుకురాలేం ఖన్నా!
పరిసరాల్ని ఒంటబట్టించుకోవాలె
కాలం కఠినమైనా కత్తి దువ్వాలె
సహనం, క్రమశిక్షణలే బలం !!
ఎన్కకుపోతే..
నీ కోసం ఏముంటదక్కడ!?
నడిచొచ్చిన పాతదారి తప్ప
యుద్ధవిరమణ ప్రకటిస్తే
ఇగ సమరభేరి ముగిసినట్లే..!
ఎన్నిసార్ల..
ఓడినమన్నది కాదు నాన్నా..!
ఫలితం మాత్రం
తీవ్ర పరిణామంలనే అందుతది!!
ఎక్కడా..
ఇసుమంతైన ఇమడలేనప్పుడు
ఓటములు గాక
ఇంకేం ఎదురుంగ వస్తరు ..!
కష్టనష్టాలు..
ఎవరికీ అవసరం లేదిక్కడ !
ఒక్క గెలుపే
అందరినీ తలెత్తుకునేలా చేస్తది.
ఏ పాత్రిచ్చినా పరకాయం సేయాలె!!
ఆగిపోతే..
అనవసరంగ ఓడిపోతం బిడ్డా..!
సాగిపోతేనే..
గెలుపుకు చిరునామైతం ఖన్నా.. !!
(ఒక్క ఓటమికే కంగిపోయే బిడ్దలకోసం ఓ తండ్రి అంతర్వేదనా గీతం..!)
– అశోక్ అవారి, 9000576581