ఎక్కడా ‘రాజ్యాంగ’ స్ఫూర్తి?

స్వేచ్ఛావాయువులతో
సగర్వంగా బతికిన రాజ్యం
నేడు కన్నీరు కారుస్తోంది.
దేశదేశాల
పాలనా గుణగణాలు ఎంచి
రూపొందించిన ‘మార్గదర్శిపొత్తం’
నేడు అపహాస్యం పాలవుతోంది.

ఓ జనతా!
అధికారం కోసం
అడ్డమైన గడ్డి తింటూ,
ధన రాజకీయాలతో
ఎన్నికల్ని అపహాస్యం చేస్తూ,
గద్దెక్కాక
వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ,
పరిరక్షించాల్సిన ‘మార్గదర్శి’నే
బలిపీఠంపైకెక్కిస్తూ,
అభివృద్ధి దృక్కోణంలో కాక
రాజకీయ దృక్కోణంలో
పాలన సాగిస్తూ,
ప్రజాస్వామ్య ఉనికినే
ప్రశ్నార్ధకం చేస్తూ
బలవంతంగా
పాలించాలనుకుంటోన్న
అక్రమార్కుల పాలనలో
నీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు
గాలికి కొట్టుకుపోతున్నాయనే
నిజం గుర్తించి,
వారి భజనలు మాని
నీ హక్కుల్ని, బాధ్యతల్ని
గాలికి వదిలేయక గొంతెత్తు.

భావోద్వేగాలను రెచ్చగొట్టే
కుట్రలు, కుతంత్రాలతో,
మార్గదర్శకులు ప్రవచించిన
ఆశయాల అమలులో
విఫలమైన నాయకగణాన్ని
సార్వభౌమాధికారం కల్గి ఉన్న నీవు,
నీకు నీవే చైతన్యమై
తరిమి తరిమి కొట్టు.
పలుచబడుతోన్న
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు.

ఓ పాలకుల్లారా!
మహామహులు కలలుగన్న
పూర్ణస్వరాజ్యానికి
బానిస సంకెళ్లు తగిలించొద్దు.
ప్రజల కష్టాన్ని
తిమింగలాలకు తాకట్టుపెట్టొద్దు
.- వేమూరి శ్రీనివాస్‌, 9912128967