25 నుంచి ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర మహాసభలు

– బ్రోచర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల 25, 26 తేదీల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర నాలుగో మహాసభలు జరగనున్నాయని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు పి ఉమర్‌ ఖాన్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని హెలెన్‌ కెల్లర్‌ విద్యా సంస్థల ప్రాంగణంలో మహాసభల బ్రోచర్‌ను ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలయ్య, నాయకులు నర్సింహాలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర మహాసభలు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్నాయని తెలిపారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టన్ని సాధించడంలో ఆ సంఘం పాత్ర చాలా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా వికలాంగుల హక్కుల సాధన కోసం, చట్టాల అమలు కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నదని చెప్పారు. వికలాంగులపై జరుగుతున్న దాడులు, వివక్షత వంటి అంశాలపై ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ అమలు కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందని వివరించారు. మహాసభల ప్రారంభానికి మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి డి సీతక్క, టీవీసీసీ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య, ఎన్‌పీఆర్‌డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నంభు రాజన్‌ హాజరు అవుతున్నారని తెలిపారు.మహాసభల ప్రారంభ సభ సందర్బంగా వికలాంగుల కళాకారులతో సాంస్క తిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్స్‌ అమలు, పెన్షన్‌ పెంపు, స్వయం ఉపాధి, చట్టాల అమలు,ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్టు తెలిపారు.