మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన డాక్టర్ ఎనుగండుల గంగాధర్ కుమారుడు అమెరికాలో ఉంటున్న ఎన్నారై ఎనుగందుల చక్రవర్తి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కరాలను అందించారు. ఎండీ సోహాన్, బసిరి రోనాడో లకు రూ.10వేల చొప్పున, సిహెచ్. శశికాంత్ కు రూ.5వేలు ప్రైస్ అందించారు. ఎన్నారై చక్రవర్తి అమెరికా నుండి పంపించిన నగదు పురస్కారాలను స్థానిక ఆయన స్నేహితులు నందగిరి దయానంద్, అడిచర్ల రవీందర్ చేతుల మీదుగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా నందగిరి దయానంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎన్నారై చక్రవర్తి నగదు పురస్కారాలను అందిస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులు మంచిగా చదివి ఉత్తమ ఫలితాలతో పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రాజన్న, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.