ఎన్టీఏ రద్దు చేయాలి

– నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి
– స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
– 15న రాష్ట్ర వ్యాప్త నిరసనలు
– ఏఐఎస్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసెన్ జిత్ 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్‌టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసెన్ జిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏఐఎస్‌ఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసా జాతీయ నేతలు ప్రసెన్ జిత్, బీహార్ పాలింగంజ్ ఎమ్మెల్యే సందీప్ సౌరబ్, సీపీఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజతో కలిసి ఆయన మాట్లాడారు. నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్‌టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు.
ఐసాను బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే సందీప్ సౌరవ్…
తెలంగాణ రాష్ట్రంలో ఐసాను బలోపేతం చేయాలని ఆ సంఘం జాతీయ మాజీ కార్యదర్శి పాలిగంజ్ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ అన్నారు. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు రాష్ట్ర ప్రతినిధుల సమావేశాలు శనివారం ముగిసాయి.  1990 దశలో ప్రత్యేక పరిస్థితి దేశ పరిస్థితుల్లో  ఐసా విద్యార్ది సంఘం ఏర్పాటు చారిత్రాత్మకమైందని తెలిపారు.  నూతన ఆర్థిక విధానాలు అమలు ప్రారంభ సమయంలో,  మత విభజన రాజకీయాలు దేశాన్ని కుదిపేసిన సమయంలో, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం, విద్యార్థి లోకానికి దిశ దశ మార్గ నిర్దేశం చేస్తూ ఐసా ఆవిర్భవించిందని గుర్తు చేశారు.  మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యా ఉపాధి కోసం, ప్రజల ప్రజాస్వామిక హక్కులు డిమాండ్ల సాధన కోసం సంఘం పోరాడుతుందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో సిపిఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్,  ఐసా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, అల్లి సాగర్,  జ్వాలా,  వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.