దేశంలోనే ఎవ్వరికీ దక్కని గౌరవం ఎన్టీఆర్‌ సొంతం

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్‌ కష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ టి.ప్రసన్న కుమార్‌, ఎఫ్‌ ఎన్‌ సి సి సెక్రటరీ మోహన్‌ ముళ్ళపూడి, ఎక్స్‌ కార్పొరేటర్‌ కాజ సూర్యనారాయణ తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా నందమూరి మోహన కష్ణ మాట్లాడుతూ, ‘మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్న నందమూరి తారక రామారావు. భౌతికంగా మా నుండి దూరమై 28 ఏళ్లు గడిచిన మనసా – ఆలోచనల్లోనూ, వాచా – మా మాటల్లోనూ, కర్మణా – మా చేతల్లోనూ మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు పెను సంచలనం. సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ అనే పేరు చెరగని ముద్ర వేసుకుంది’ అని అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మాట్లాడుతూ, ‘మరణం లేని మహా నాయకుడు నందమూరి తారక రామారావు. సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది అలాగే రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన వ్యక్తి. భారతదేశంలోనే ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం. ఫిలింనగర్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి అని గవర్నమెంట్‌కి విన్నవించు కుంటున్నాం’ అని తెలిపారు. ‘రాముడుగా చేసినా, రావణాసురుడిగా చేసినా, నాయకుడిగా, ప్రతినాయకుడిగా చేసినా అది ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. ఫిలింనగర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం ఉంది అని మనం గర్వంగా కాలర్‌ ఎగరేసుకొని చెప్పేలాగా ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఎన్టీఆర్‌ ఒక చరిత్ర.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం’ అని అన్నారు.