ఎన్టీఆర్‌.. చిరకాలం గుర్తుంటారు

– ఘనంగా ‘మనదేశం’ 75 సంవత్సరాల విజయోత్సవ వేడుక
ఎన్టీఆర్‌ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌ సెంటనరీ సెలబ్రేషన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ‘మనదేశం’ చిత్ర నిర్మాత కష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ తనయుడు రమేష్‌ ప్రసాద్‌, పూర్ణా పిక్చర్స్‌ అథినేత విశ్వనాథ్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ సెంటనరీ సెలబ్రేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ జనార్థన్‌ మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్‌ 28వ వర్థంతి కార్యక్రమం రోజున ఆయన నటించిన ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు, కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌’ అని చెప్పారు. ‘తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్‌ వేసిన ముద్ర చెరగనిది. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్‌గా, దర్శకుడిగా తెలుగు సినిమా అభివద్ధికి బాటలు వేశారు. ఎన్టీఆర్‌ రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారు’ అని నిర్మాత ఆదిశేషగిరిరావు చెప్పారు. నందమూరి మోహనకష్ణ మాట్లాడుతూ, ‘వజ్రాన్ని కూడా సానపట్టాలి. అలా ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి ఎన్టీఆర్‌ను నటుడిగా మెరుగులు దిద్దింది ఎల్వీ ప్రసాద్‌, కష్ణవేణి అమ్మకి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది’ అని తెలిపారు. శ్రీమతి కష్ణవేణి మాట్లాడుతూ, మేము నిర్మించిన ‘మనదేశం’ చిత్రం 75 సంవత్సరాల వేడుక జరగటం, ఆ సినిమా ద్వారా రామారావుని మేము పరిచయం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌, పూర్ణా పిక్చర్స్‌ విశ్వనాధ్‌, నిర్మాతల మండలి తుమ్మల ప్రసన్నకుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ, దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి నారాయణరావు, విక్రమ్‌ పూల, మండవ సతీష్‌, శ్రీపతి సతీష్‌ అతిథులను పుష్పగుచ్చాలతో సత్కరించారు.