యూపీలో నర్సింగ్‌ సంక్షోభం

– రాష్ట్రంలో కేవలం 1.38 లక్షల మంది నర్సులు
– కొరతతో రాష్ట్ర ఆస్పత్రుల్లో ఇక్కట్లు
– శ్రద్ధ పెట్టని యోగి సర్కారు
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ నర్సుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర జనాభాకు తగిన సంఖ్యలో నర్సులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో యోగి సర్కారు పాలనలో ఆరోగ్య వ్యవస్థ కొత్త సవాలును ఎదుర్కొంటున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 23 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో కేవలం 1.38 లక్షల మంది నర్సులు, మంత్రసానులు ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణం ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే యూపీలో మాత్రం ఇది 0.6 మాత్రమే కావడం ఆందోళనకరం.
రాష్ట్రంలో 27 కొత్త నర్సింగ్‌ కళాశాలలను నిర్మించడానికి కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రానికి రూ.270 కోట్లు కేటాయించింది. అయినప్పటికీ ఇందులో రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఒకటి.. శిక్షణ కోసం అధ్యాపకుల కొరత. రెండోది.. అలాంటి సంస్థల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థుల నాణ్యత. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 23 నర్సింగ్‌ కళాశాలలు ఉన్నాయి, వాటిలో 17.. 2021లో మాత్రమే విద్యార్థులను చేర్చుకోవడం ప్రారంభించాయి. బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ అనేది నాలుగు సంవత్సరాల కోర్సు. రాష్ట్రంలోని ఆరు నర్సింగ్‌ కళాశాలలు (లక్నోలో రెండు, ఝాన్సీ, కాన్పూర్‌, మీరట్‌, ఇటావాలో ఒక్కొక్కటి) సంవత్సరానికి 420 గ్రాడ్యుయేట్‌లను తయారు చేస్తుంది. ఇది 2025 నుంచి 620కి పెరుగుతుందని అంచనా. కానీ గ్రాడ్యుయేట్‌ అయిన వారందరూ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల వైపు చూడరనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. నాణ్యమైన నర్సింగ్‌ విద్యార్థులు ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందేలా రాష్ట్రం నిర్ధారించాలని వైద్య రంగ నిపుణులు తెలిపారు.
గతంలో ఆరోగ్య శాఖలో, నిటి ఆయోగ్‌లో సలహాదారు (ఆరోగ్యం)గా పనిచేసిన 1993-బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీ కుమార్‌ మాట్లాడుతూ.. ”మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో కలిసి ఉన్న నర్సింగ్‌ కాలేజీలకు మౌలిక సదుపాయాలను సష్టించాలి. 12వ తరగతి నుంచి ఎక్కువ మంది విద్యార్థులను నర్సింగ్‌లో చేరేలా చేయాలి. నీట్‌ లాంటి సాధారణ ప్రవేశ పరీక్ష నిర్వహించడం ద్వారా నాణ్యమైన విద్యార్థులను చేర్చుకోవడం దీని లక్ష్యం” అని ఆయన అన్నారు. యూపీలో మాత్రం నర్సుల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దారుణంగా ఉన్నది. 1,000 జనాభాకు తొమ్మిది మంది నర్సులు ఉన్న కేరళ, ఆరుగురు నర్సులను కలిగి ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. ఈ రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయుల సహాయంతో శిక్షణ పొందిన నర్సింగ్‌ ఫ్యాకల్టీ కొరత పూడ్చబడుతుందని శ్రీ కుమార్‌ చెప్పారు. అయితే యోగి ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థపై చిన్న చూపు చూస్తున్నదని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యోగి సర్కారుకు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ల కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఆస్పత్రుల్లో రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారనీ, ఇటు నర్సింగ్‌ విద్యార్థులు కూడా నష్టపోతున్నారని వైద్య నిపుణులు చెప్పారు.