పోషకాల డ్రై ఫ్రూట్స్‌…

డ్రైఫ్రూట్స్‌ శరీరానికి ఎన్ని పోషకాలను అందిస్తాయో, ఎంత బలమో అందరికీ తెలిసిన విషయమే. కానీ పిల్లలు కొన్ని రకాల నట్స్‌ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి చిక్కీ, లడ్డు, బొబ్బట్లు ఇలా వెరైటీగా చేసిస్తే ఫలితం ఉంటుంది. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి తియ్యగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని తినవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, గర్భిణీలు, బాలింతలు ఇలా అందరూ ఈ డ్రై ఫ్రూట్స్‌తో చేసిన వంటకాల నుంచి ఆరోగ్య పరంగా మంచి ఫలితాలను పొందవచ్చు.
డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌ మారే సమయంలో వచ్చే కొన్ని అనారోగ్యాలకు ఇవి చెక్‌ పెడతాయి. ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్‌ అధికంగా ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణను, హిమోగ్లోబిన్‌ స్థాయిలను మెరుగుపరుస్తాయి. మహిళల్లో అధికంగా కనిపించే రక్తహీనత వీటిని తినడం వల్ల పోతుంది. అందుకే పిల్లలు, మహిళలు తినాల్సిన అవసరం ఉంది. డ్రైఫ్రూట్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని రాకుండా అడ్డుకుంటుంది. వీటిని రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు మెరుగుపడతాయి. వీటిలో ఉండే కొవ్వులు, ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు ఇవి చాలా అవసరం. జుట్టు ఊడిపోవడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఫ్రీరాడికల్స్‌తో పోరడతాయి.
బొబ్బట్లు
కావాల్సిన పదార్థాలు :
పిండి కోసం : 250 గ్రాముల మైదా పిండి లేదా గోధుమ పిండి, బొంబాయి రవ్వ – పావు కప్పులో సగర, ఉప్పు – చిటికెడు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్‌లు, నీళ్లు – పిండి కలపడానికి సరిపడ
మిక్చర్‌ కోసం : పచ్చి శనగ పప్పు – ఒక కప్పు లేదా 200 గ్రాములు, బెల్లం తురుము – 200 గ్రాములు, ఉప్పు – చిటికెడు, నీళ్లు – 200 ఎం.ఎల్‌., బాదంపప్పు – పదిహేను, పిస్తాపప్పులు – పదిహేను, జీడిపప్పులు – పదిహేను, పల్లీలు – పావు కప్పు (వేయించి పొట్టు తీసినవి), ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, యాలకులు – మూడు
బొబ్బట్ల కోసం : ప్లాస్టిక్‌ షీట్‌ – ఒకటి, నెయ్యి – పావు కప్పు
తయారు చేసే విధానం : మైదా పిండి లేదా గోధుమ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, నూనె, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి. పైన తేమ కోల్పోకుండా కొద్దిగా నూనె రాసి మూత ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి పచ్చి శెనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి అంగుళం పైన వరకు నీళ్లు పోసి స్టవ్‌ మీద పెట్టి ఉడికించాలి. పప్పు చేతితో పట్టుకుని ఒత్తితో మెత్తగా ఉండాలి. అంత వరకు ఉడికించుకోవాలి. అదే ప్రెషర్‌ కుక్కర్‌లో అయితే ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించి వెంటనే దించుకోవాలి. అందులో నీళ్లు వార్చేసి పప్పును పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడి పప్పు, బాదం, పల్లీ, పిస్తా పప్పులను దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. యాలకులను కూడా పొడి చేసి, పొడులన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న పచ్చి శెనగ పప్పును కూడా మిక్సీలో వేసి పొడి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో బెల్లం తురుము, నీళ్ళు పోసి మరిగించాలి. మరగడం మొదలవగానే తయారు చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, పప్పును కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిగా ముద్దలా అవగానే స్టవ్‌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారక మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పిండి మధ్యలో ఉంచి చపాతీ లా ఒత్తుకోవాలి. పెనంపై నెయ్యి వేస్తూ రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి రాయాలి. అంతే డ్రైఫ్రూట్స్‌ బొబ్బట్లు రెడీ.
చిక్కీ
కావాల్సిన పదార్థాలు : బాదం పప్పులు – పదిహేను, జీడిపప్పులు – పది, పిస్తా పప్పులు – పది, గుమ్మడి గింజలు – మూడు స్పూన్లు, ఎండు నల్ల ద్రాక్షలు – పది, నువ్వులు – నాలుగు స్పూన్లు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – సరిపడా, నెయ్యి – స్పూన్‌
తయారు చేసే విధానం : బాదం, జీడిపప్పులు, పిస్తా, ఎండు నల్లద్రాక్షలు సన్నగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి డ్రై ఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒక చెంచా నెయ్యి వేసి, ఒక కప్పు బెల్లం, కాస్త నీరు వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకంలా తయారయ్యాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్‌తో పాటూ, వేయించిన నువ్వులు, గుమ్మడి గింజలు కూడా వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌లోపల కాస్త నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చాకుతో ముక్కలుగా కోయాలి. పూర్తిగా చల్లారాక ముక్కలు తీసి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు.
లడ్డూ
కావాల్సిన పదార్థాలు : నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌, గోంధ్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, బాదం పలుకులు – పావు కప్పు, పిస్తా పలుకులు – పావు కప్పు, కర్బూజ గింజలు – పావు కప్పు, గసగసాలు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, పండు ఖర్జూరాలు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్‌, జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌.
తయారు చేసే విధానం : ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోంద్‌ను వేసి వేయించాలి. తర్వాత దీనిని రోట్లోకి తీసుకుని మెత్తగా దంచుకోవాలి. తర్వాత అదే కళాయిలో మరో టీస్పూన్‌ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కళాయిలో బాదం పప్పు, పిస్తాపప్పు, కర్బూజ గింజలు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో గసగసాలను, ఎండు కొబ్బరి పొడిని విడివిడిగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిక్సి జార్‌లోకి ఖర్జూరాలను వేసి పేస్ట్‌ లాగా చేసుకోవాలి. తర్వాత కళాయిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి వేడి చేయాలి. వేడయ్యాక వేయించిన పదార్థాలతో పాటు పొడిగా చేసుకున్న గోంధ్‌ను కూడా వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి అంతా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. ఈ లడ్డూలు ఆరిన తర్వాత గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి.