ఓ.. రక్త పిపాసి! ఇకనైనా యుద్ధం ఆపు!!

O.. bloodthirsty! Stop the war!!”ధర్మో రక్షతి, రక్షిత:” అన్నారు పెద్దలు. ఈ కర్తవ్యాన్ని విస్మరించి దేశాధినేతలు, మేధావులు, మిన్నకున్నా తనను తాను కాపాడుకునేందుకు, ధర్మం నిర్విరామంగా పరిశ్రమిస్తూనే ఉంటుంది. ఆక్రమంలో అధర్మానికి దన్నుగా నిలిచిన సజ్జనులను సైతం, నశింపజేస్తుంది ధర్మం! అధర్మ కౌరవులకు అండగా నిలిచిన భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాదుల వినాశనమే నిదర్శనమంటూ మానవాళిని – హెచ్చరిస్తున్నది మహాభారతం! పాలస్తీనీ యులపై ఇజ్రాయిల్‌ నరమేధాన్ని కనీసం ఖండించని భారత పాల కులు, పార్టీలు, మేధావులూ మహాభారత – హెచ్చరికను మననం చేసుకుందురుగాక! ఇజ్రాయిల్‌ది అధర్మం! పాలస్తీనాది ధర్మం! అనటానికి చరిత్రే సాక్ష్యం! నాడు ప్రపంచంలో నిలువనీడ లేక, తలదాచుకుంటామని అరబ్బుల నభ్యర్థించి వలసొచ్చి పాలస్తీనాలో స్థిరపడ్డారు యూదులు. 1920 నాటికి పాలస్తీనా జనాభాలో 8శాతంగా ఉన్న యూదులు, వలసలద్వారా 1945 నాటికి 35.8శాతానికి పెరిగారు. 1) నాడు పాలస్తీనాను పాలిస్తున్న బ్రిటిష్‌ వారి అండదండలు 2) దేశ దేశాల నుండి తాము కూడబెట్టుకు వచ్చిన ధనరాశులతోను, అప్పుల పాలై యున్న అరబ్బుల లక్షల ఎకరాల పొలాలను,-బ్రిటిషు వారు ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలోకి నెట్టారు.అదే సందర్భంలో పాలస్తీనా జాతీయ పరిశ్రమలను, కారుచౌకగా కొన్నారు యూదులు! అలా ప్రణాళికాబద్దంగా పెంచుకున్న అంగ, అర్థ, సైనిక బలగాలతో-సగానికి పైగా పాలస్తీనాను దురాక్రమించి ‘ఇజ్రాయిల్‌’ను స్థాపించుకున్నారు యూదులు.
అపార చమురు నిక్షేపాలున్న పశ్చిమాసియాలోని అరబ్బు దేశాల చమురు దోపిడీకి, పశ్చిమాసియాకు ముఖద్వారం వంటి పాలస్తీనాలో తమకు అనుకూల దేశం ఉండాలన్న కుట్రతోనే అక్కడ ఇజ్రాయిల్‌ స్థాపనకు ధృఢమైన పునాది వేసింది బ్రిటన్‌! ఆ దురుద్దేశంతోనే ఇజ్రాయిల్‌ను పెంచి బలోపేతం చేసింది అమెరికా! – నాడు యూదులకంటూ సొంత దేశం ఏర్పాటును ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన మాట వాస్తవం! ఎందుకంటే? – ‘నాడు ప్రపంచంలో దారుణ చిత్రహింసలకు, హిట్లర్‌ నరమేధానికి గురైన బాధితులు యూదులన్నది చారిత్రక సత్యం!హింసలు తాళలేక తమ పూర్వికులు నివసించిన పాలస్తీనాకు తిరుగుముఖం పట్టారు. అరబ్బుల నభ్యర్థించి,పాలస్తీనాలో చొరబడి, సర్వతోముఖాభివృద్ధిని సాధించాక ఇజ్రాయిల్‌ను స్థాపించుకున్నారు యూదులు. కానీ బాధాకరమేమిటంటే, ‘దయతో తలదాచుకోనిచ్చిన – యజమానిని వెలుపలికి నెట్టేసి, గుడారం మొత్తాన్ని ఆక్రమించిన ఒంటెలా’ ఆశ్రయమిచ్చిన అరబ్బులను తన్ని తరిమేసిన చందంగా ఉంది ఇజ్రాయిల్‌ తీరు. పాలస్తీనాను దురాక్రమించి ఏకైక యూదురాజ్యాన్ని నిర్మించాలన్న దురాశతో అరబ్బులపై ాడులకు తెగబడి నాటి ‘హిట్లర్‌’ను తలపిస్తున్నాడు నేటి నెతన్యాహూ’!
ఐరాస జోక్యం-ఇజ్రాయిల్‌ బరితెగింపు
బ్రిటిష్‌ వారు వెళ్లాక మరింతగా బరితెగించింది ఇజ్రాయిల్‌! ఐ.రా.స. జోక్యం చేసుకుని 55శాతం ఇజ్రాయిల్‌కు, 45శాతం పాలస్తీనాకు- భూభాగాన్ని కేటాయించి రాజధాని జెరూసలేంను స్వీయ పర్యవేక్షణలో ఉంచుకున్నది. కానీ ‘ఐరాస’ ఆదేశాలను తిరస్కరించి మూడొంతులకు పైగా పాలస్తీనాను దురాక్రమించింది ఇజ్రాయిల్‌. అందుకే 1990లో ఇజ్రాయిల్‌ను ‘టెక్రరిస్టు-స్టేట్‌’గా ప్రకటించింది ఐరాస! బ్రిటన్‌, అమెరికా, వాటి తోక దేశాలు తప్ప, ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐరాస నిరసిస్తున్నా సరే, నిస్సిగ్గుగా అరబ్బులపై మారణకాండను కొనసాగిస్తూనే ఉన్నాడు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ! అంతేగాదు పాలస్తీనా యూదులదే, దాన్ని తొలుత పాలించింది యూదులేనంటూ సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాడు!
కానీ చారిత్రక వాస్తవమేమంటే, మతాలు పుట్టక పూర్వం ప్రజలందరిదీ మానవజాతే! మానవులంతా సంచార తెగలవారే! ప్రపంచమంతటా సంచరిస్తూ తమ కనుకూల మనుకున్న ప్రాంతాలలో ఆయా తెగలు స్థిరపడ్డారు. ఉదా|| ఊదయా పర్వతాల నుండి పాలస్తీనాకు వలసొచ్చిన సంచార తెగవారే యూదులు! వారికన్నా ముందే ‘పిలస్తీనీ’ తెగవారు ఆ ప్రాంతాన్ని పాలించారు. వారి పాలనలో ఉన్న భూభాగమే ‘పాలస్తీనా’గా వ్యవహరింప డబుతుందని అంటున్నారు చరిత్రకారులు! పిలస్తీనీలు-యూదులు-రోమన్‌ క్రైస్తవులు, టర్కీ అరబ్బులు, బ్రిలిష్‌ వారు పాలించిన ప్రాంతం పాలస్తీనా! రోమన్‌ క్రైస్తవ ప్రభువుల పాలనలో వారి ఆంక్షలకు తాళలేక 90శాతం యూదులు వివిధ దేశాలకు వెళ్లారు! అరబ్బు చక్రవర్తుల ఆంక్షలకు తాళలేక క్రైస్తవులూ వలసవెళ్లారు. పాలకులెవరైనా, నాటికీ, నేటికీ పాలస్తీనాను అంటి పెట్టుకున్న మెజారిటీ ప్రజలు అరబ్బులేనని చరిత్ర చెబుతున్నది! పాలస్తీనా భిన్న జాతుల నిలయమని రాజధాని జెరూసలేంలోని – ‘సాల్మన్‌ టెంపుల్‌’ (పవిత్రగృహం) – ‘హెలీ చెపల్‌ చెప్‌ చర్చ్‌’ – ‘అల్‌అక్సా’ మసీదులు చాటి చెబుతున్నారు!
‘బతకడం కోసం చద్దాం’:హమాస్‌
నాడు హిట్లర్‌ నరమేధానికి తాళలేక యూదులు చెల్లాచెదురైనట్ల నేడు నెతన్యాహూ నరమేధానికి తాళలేక నలభై శాతం అరబ్బులు వలసెళ్లారు.ఇరవైశాతం అరబ్బులు ఇరుగుపొరుగు దేశాల్లో శరణార్ధులుగా తలదాచుకుంటున్నారు. అలా వెళ్లిన అరబ్బులు తిరిగి పాలస్తీనా వచ్చేందుకు వీల్లేకుండాను- వెళ్లిపోయిన అరబ్బుల ఇండ్లు, పొలాలనూ ఇజ్రాయిల్‌ సొంతం చేసుకునేలా చట్టాలు చేసింది ఇజ్రాయిల్‌! మిగిలిన అరబ్బులను ‘గాజా’ ‘వెస్ట్‌బ్యాంక్‌’లలో కుక్కి అక్కన్నుండి వాళ్లు వెలుపలకు రాకుండా సరిహద్దు – చుట్టూ 60కి|| మీ|| మేర లక్షల కోట్ల రూ||తో క్షిపణి నిరోధక ఉక్కుకంచెను నిర్మించుకున్నది ఇజ్రాయిల్‌! అయినా సరే! ఇజ్రాయిల్‌ నిర్భంధంలో చిత్రహింసలకు గురవుతూ బందీలుగా ఉన్న ఆరువేల మంది పాలస్తీనా విముక్తి పోరాట యోధులను విడిపించుకోటానికి 7అక్టోబర్‌2023న ఉక్కు కంచెను ఛేదించు కుని ఇజ్రాయిల్‌లో ప్రవేశించి, వివిధ రంగాల ఇజ్రాయిల్‌ ప్రముఖులు 199 మందిని, తమవెంట గాజాకు తరలించు కెళ్లారు ‘హమాస్‌’ వీరులు! ఇజ్రాయిల్‌ చేతిలో రోజూ చస్తూ బతకటం కన్నా, బతకటం కోసం చద్దాం!” అన్న పాలస్తీనా ప్రజల ఆకాంక్షనుండి పుట్టిన పోరాట సంస్థయే ‘హమాస్‌’.
నాటి నుండి ప్రతికార చర్యల పేరిట హాస్పిటల్స్‌, స్కూల్స్‌,- మసీదులు, నివాస గృహాలపై విచక్షణా రహితంగా బాం బులు కురిపించింది. ‘గాజా’ను శ్మశానం చేసాడు నెతన్యాహూ! జూలై (24 సం||) నాటికి నలభై వేల మంది కాలిపోగా, లక్షల సంఖ్యలో నిర్వాసితులు, వికలాంగులయ్యారు. అంతేగాదు, ఇరాన్‌ రాజధాని టెహరన్‌కు అతిధిగా వెళ్లిన ‘హమాస్‌’ అగ్రనేత ‘ఇస్మాయిల్‌ హనియా’ ను-లెబనాన్‌ రాజధాని బీరూట్‌ కెళ్లి అక్కడ ‘హిజబుల్లా’ సీనియర్‌ మిలిటిరీ కమాండర్‌ ‘షాద్‌ షుకుర్‌’ ను ఒకే రోజు 31జులై 24న హతమార్చింది ఇజ్రాయిల్‌! తద్వారా ప్రపంచంలో ఎవరినైనా, ఏదేశాని కెళ్లైనా చంపేస్తాం, తస్మాత్‌ జాగ్రత్త! అని ప్రపంచ దేశాలకు సవాలు విసిరింది ఇజ్రాయిల్‌!
నెతన్యాహూ బలగర్వం-అరబ్‌దేశాల ఐక్యత
నాడు ‘హిట్లర్‌’ దురహంకారం ప్రపంచ దేశాలను ఐక్యం చేసినట్లు ‘మోడీ’ లెక్కలేని తనమే ‘ఇండియా’ కూటమికి బీజం వేసినట్లు ‘నెతన్యాహూ’ బలగర్వమే, పాలస్తీనా పరాట సంస్థలను, అరబ్‌దేశాలను ఐక్యం చేసింది! పాలస్తీనా విముక్తి కోసం విడివిడిగా పోరాడుతున్న గాజాలోని ‘హమస్‌’ వెస్ట్‌బ్యాంక్‌లోని ‘ఫతా’లతో సహా పద్నాలుగు పార్టీలు, సంస్థలన్నీ సమైక్యంగా పోరాడేందుకు, ఒకే జాతీయ ప్రభుత్వ రూపకల్పనకు చైనా మధ్యవ్యర్తిత్వంతో అంగీకరించినరు! అలా ‘పాలస్తీనా జాతీయ కూటమి’ చిగురించింది.1967 నాటి సరిహద్దులతో-తూర్పు జెరూసలేం రాజధానిగా స్వంతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు అంగీకరిస్తేనే, ఇజ్రాయిల్‌ సంబంధాలు కొనసాగిస్తామని, అమెరికా అనుకూల ‘సౌదీ అరేబియా’తో సహా యూఏఈ దేశాలన్నీ తెగేసి చెప్పినరు. ‘ఓరక్త పిపాసీ నెతన్యాహూ! తక్షణం పాలస్తీనాపై మారణకాండను ఆపెరు’ అంటూ ఎర్రచొక్కాలతో, మిన్నంటే నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అమెరికాలోని యూదులు! ఇండిపెండింట్‌ ‘బెర్నీ శాండల్స్‌’తో సహా యాభై మంది డెమోక్రటిక్‌ సెనేటర్లు’ నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించారు.’రషీదాతైబ్‌’ అను సెనేటర్‌ ”యుద్ధ నేరస్తుడు నెతన్యాహూ!” అన్న ప్ల్లకార్డును వైట్‌హౌస్‌ ఛాంబర్‌లోనే – ప్రదర్శించాడట.పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం అధర్మం. ఈ చర్యల్ని ప్రపంచ దేశాలూ ఖండిస్తున్నాయి. ”ధర్మమేవ జయతే!” పాలస్తీనాకు విజయోస్తు! ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక!

– పాతూరి వేంకటేశ్వరరావు, 9849081889