ముదిగొండ వీరులారా..! పోరాడే జెండాలో తారలారా..!

వీర తెలంగాణ సాయుధ పోరాటమే.. భూ పంపిణీకి పునాది
– మణిపూర్‌ ఘటనపై నోరు మెదపని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
– భూపారాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలు ఉధృతం
– మతోన్మాదాన్ని తరిమికొట్టడమే కమ్యూనిస్టుల లక్ష్యం
– కమ్యూనిస్టుల త్యాగఫలితమే పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు పంపిణీ
– భూపోరాట అమరవీరుల 16వ వర్ధంతి సభలో పొన్నం
నవతెలంగాణ- ముదిగొండ
ఎర్రజెండా నీడన జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే దేశంలో పేదలకు భూ పంపిణీకి పునాది వేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో భూపోరాట అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అధ్యక్షతన శుక్రవారం అమరవీరుల 16వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను ఎగరవేసి ఆయన మాట్లాడారు. నైజాం రజాకారుల, పటేల్‌, పట్వార్ల దోపిడీపై దండెత్తి మెడలు వంచిన కమ్యూనిస్టుల త్యాగ ఫలితమే ఆనాడు దేశంలో 4 వేల గ్రామాల్లో ఎర్రజెండా ఎగరేసి, వేలాది ఎకరాలను ప్రజలకు పంపిణీ చేసిన ఘనత ఎర్రజెండాకే దక్కిందన్నారు. 2007 జులై 28న ముదిగొండలో జాగా కోసం ఆందోళన నిర్వహిస్తున్న పేదలపై అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రాకాసి బల్లిలా పోలీసులతో ప్రజలపై తూటాల వర్షం కురిపించి, ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా గ్రామస్తులు చూపిన పోరాట పటిమ ఫలితంగానే అప్పటి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. నైజం రజాకార్ల దోపిడీ విధానాలపై జరిగిన పోరాటం నుంచి నేటి భూపోరాట అమరవీరుల ఉద్యమం వరకు ముదిగొండ పేరు కమ్యూనిస్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. భూపోరాట అమరవీరుల ఉద్యమ స్ఫూర్తితో మరిన్ని ప్రజాఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసకాండపై ప్రధాని మోడీ నిర్లక్ష్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మణిపూర్‌ సంఘటనలు మరే రాష్ట్రాల్లో పునరావృతం కాకుండా దోషులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సాయుధ తెలంగాణ పోరాట యోధులు మచ్చా వీరయ్య, రావెళ్ళ సత్యం, గండ్లూరి కిషన్‌రావు లాంటి మహా నాయకుల బలిదానాలతో కమ్యూనిస్టు చరిత్ర మరింత ఎరుపెక్కిందన్నారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్‌ మాట్లాడుతూ.. భూమి, ఆకాశమున్నంత వరకు ముదిగొండ భూపోరాట అమరవీరుల త్యాగం ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ గుర్తుంటుందన్నారు. వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు నెమిలి సైదులు, రాయల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్‌, బండి పద్మ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, మండల నాయకులు పయ్యావుల పుల్లయ్య, ప్రభావతి, కందుల భాస్కరరావు, గ్రామ నాయకులు కట్టకూరి ఉపేందర్‌, యండ్రాతి సీతయ్య, అమరవీరుల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.