ఓట్ ఫ్రమ్ హోమ్..

– దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి 

నవతెలంగాణ పెద్దవంగర: దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ మండలంలో ఈనెల 21 నుండి 25 వరకు కొనసాగుతుందన్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మండల పరిధిలో మొత్తం 82 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ కోసం ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో గత రెండు రోజులుగా 47 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఓటరు ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్‌ వాహనంలో చేరుకుని, ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు.  అధికారులు నిర్దేశించిన చోట ఓటరు రహస్యంగా తన ఓటు వేసి, బ్యాలెట్‌ బాక్సులో వేశారు. ఇద్దరు పోలింగ్‌ అధికారులు, పోలీసు అధికారితోపాటు ఓ వీడియో గ్రాఫర్‌ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఓటరు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ప్రక్రియంతా వీడియో తీసి, పాలకుర్తి రిటర్నింగ్ అధికారికి పంపించారు.