– గోప్యత కంటే పారదర్శకతే ముఖ్యం
– ఈవీఎంల పనితీరుపై నిపుణుల మనోగతం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) తనిఖీ చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈవీఎంల వనరుకు సంబంధించిన కోడ్‌ను వెల్లడిస్తే సంఘ విద్రోహ శక్తులు ఆ యంత్రాల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉన్నదని అంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. అయితే భద్రతను కారణంగా చూపి పిటిషన్‌ను విచారణకు స్వీకరించకపోవడం సబబు కాదని న్యాయ న్యూఢిల్లీకి చెందిన భద్రతా పరిశోధకుడు, సాంకేతిక నిపుణుడు కరణ్ సైనీ అభిప్రాయపడ్డారు. వ్యవస్థ సరిగా పనిచేయకపోతే దానికి మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కంటే గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదం సరి కాదు. ఈవీఎంల పనితీరును పరిశీలించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని పిటిషనర్ సునీల్ అహ్యా తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్‌కు చెందిన సాంకేతిక మదింపు కమిటీ (టీఈసీ)కి మాత్రమే ఈవీఎంలను తనిఖీ చేసే అధికారం ఉంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించకపోవడానికి సుప్రీంకోర్టు రెండు కారణాలు చూపింది. మొదటిది…ఎన్నికల కమిషన్ తన విధి నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పడానికి న్యాయస్థానానికి ఆధారాలేవీ చూపలేదు. రెండోది…కోడ్‌ను బహిర్గతం చేస్తే ఎన్నికల ప్రక్రియతో రాజీ పడినట్లు అవుతుంది. ఫలితంగా ఈవీఎంలలోని భద్రతా లోపాలు బయటపడి సంఘ విద్రోహ శక్తులు ప్రయోజనం పొందే ప్రమాదం ఉంటుంది. ‘ఈవీఎంకు సంబంధించిన వనరు కోడ్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచితే దానిని ఎవరు హ్యాక్ చేస్తారో మీకు తెలుసు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోడ్‌ను బహిర్గతం చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న మాట నిజమే అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను, విశ్వసనీయతను పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఈవీఎంల వనరు కోడ్‌ను ప్రచురిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. ఈవీఎంల పనితీరును స్వతంత్ర నిపుణులు పరిశీలించే అవకాశం కలుగుతుంది. ఈవీఎంల విషయంలో గోప్యతను పాటించడం వల్ల వాటిపై ఎంత వరకూ ఆధారపడవచ్చునన్న అనుమానాలు ప్రబలుతున్నాయి. ప్రజల తీర్పును తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేయాలంటే ఈవీఎంల అంతర్గత పనితీరును పరిశీలించేందుకు పారదర్శకమైన ప్రక్రియ అవసరమవుతుంది.
2010లోనే పరిశీలన
ఈవీఎంల పనితీరును గతంలోనే కొందరు నిపుణులు పరిశీలించారు. 2010లో భద్రతా పరిశోధకుడు హరి కె.ప్రసాద్ మరో ఇద్దరితో కలిసి రెండో తరం ఈవీఎంను పరిశీలించి, లోపాలను బయటపెట్టారు. అయితే ఈవీఎంను దొంగిలించి, ప్రదర్శించాడన్న ఆరోపణపై ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండీ ఆయన ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, భద్రత గురించి తరచూ మాట్లాడుతూనే ఉన్నారు. మూడో తరం ఈవీఎంలను సైతం హ్యాక్ చేయవచ్చునని ఆయన 2019లో ప్రకటించారు. అమెరికా వంటి దేశాలలో ఈవీఎంల భద్రతా తనిఖీలకు హ్యాకర్లను అనుమతిస్తారు. ప్రపంచంలో హ్యాకర్లు, భద్రతా సిబ్బందితో కూడిన అతి పెద్ద సంస్థ డెఫ్‌కాన్ ప్రతి సంవత్సరం నెవాడాలోని లాస్ వేగస్‌లో సామావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిని ‘ఓటింగ్ గ్రామం’గా పిలుస్తారు. ఈవీఎంలలో భద్రతా వైఫల్యాలను బయటపెట్టాల్సిందిగా ఆహుతులను కోరతారు. ఈ ప్రయత్నాలు అనేక సందర్భాలలో విజయవంతం అయ్యాయి కూడా. 2018లో 11 సంవత్సరాల బాలుడు ఎమరెట్ బ్రేవర్ ఓ నమూనా ఈవీఎంను హ్యాక్ చేశాడు. కీలక సమాచారాన్ని కాపాడుతూనే ఈవీఎంలను తెరిచి, భద్రతాపరమైన అంశాలను పరిశీలించవచ్చునని అమెరికా చెబుతోంది. ఇదిలావుంటే వలసవాదులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ యంత్రాలను (ఆర్‌వీఎంలు) ప్రవేశపెట్టాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. దీనిని అనేక పార్టీలు వ్యతిరేకించాయి. వలసవాదులకు ఇది ప్రయోజనకరమే అయినప్పటికీ ఈ విధానం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.