ఆటంకాలు బ‌ద్ద‌లు కొట్టుకుంటూ..

Obstacles are breaking..‘మహిళలకు బాధ్యతలు ఎక్కువ. ఇంటి పనికి, పిల్లలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగానికి ఇవ్వరు’ అంటూ వారి అభివృద్దికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తుంది ఈ పురుషాధిక్య సమాజం. అనేక సాకులు చూపి గొప్ప అవకాశాలకు దూరం చేస్తుంటారు. అలాంటి ఆటంకాలను బద్దలు కొట్టుకుంటూ తమ కలలను నిజం చేసుకుంటున్న వారు మన ముందు ఎందరో ఉన్నారు. అలా పోలీసు డిపార్టుమెంటులో ముందుకు దూసుకుపోతున్న మహిళా ధీరల పరిచయాలు నేటి మానవిలో…
ఇద్దరు బిడ్డల తల్లిగా ఉంటూనే…
ఇంట్లో ఏడు నెలల చిన్నారి. మరో పాపకు రెండున్నర ఏండ్లు. వారి ఆలనా పాలనా చూసుకోవడమంటే అంత సులభమైన విషయం కాదు. అలాంటిది ఆ పిల్లల్ని అమ్మమ్మ వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయట పెట్టింది. ఆమే మణిమాల. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్‌ రావడంతో ఎలాగైనా ఆ జాబ్‌ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరింది. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈవెంట్స్‌ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. మణిమాల తండ్రి నాగళ్ల శ్రీనివాస్‌. అంబర్‌పేట్‌లోని సీపీఎల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లలో ఆనందం చూశానని ఆమె సంతోషంగా చెప్పుకుంటున్నారు. తండ్రి, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెబుతున్నారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉడటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని అంటున్నారు.
సమాజానికి సేవ చేయాలని
ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి 32 ఏండ్ల వయసులో గ్రౌండ్‌ బాటపట్టారు. అనుక్షణం తనని తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్‌, ఔట్‌ డోర్‌ విభాగంలో దూసుకుపోయి టాపర్‌గా నిలిచి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ. భద్రాచలంలో సారపాక గ్రామానికి చెందిన ఆమె నిరుపేద కుటుంబం నుండి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు. ఆయన పెండిండ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్‌ కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ద పెట్టారు. గతంలో గ్రూప్‌-4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యమైందని ఆమె చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని చెబుతున్నారు.
ఆఫీసర్‌ అవ్వాలని…
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాలంటే చాలా కష్టం. మరో రంగంలో ఉంటూ యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఉత్తరప్రదేశ్‌లోని జిల్లా పిల్ఖువాకి చెందిన ఆష్నా చౌధురి మాత్రం ఇప్పుడు చాలా మందికి రోల్‌ మోడల్‌గా మారారు. యూపిఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో విజయం సాధించి ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయ్యారు. ఇప్పుడు రౌడీలను పరిగెత్తించే డైనమిక్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
అష్నా చౌధురి ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుడ్‌ జిల్లా పిల్ఖువాకి చెందిన వారు. ఈమె చదువుకున్న ధనిక కుటుంబానికి చెందిన వారు. ఆమె కుటుంబంలో పలువురు ప్రొఫెసర్లు ఉన్నారు. అందుకే ఆష్నా కూడా పీహెచ్‌డీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆష్నా ఆలోచన వీటన్నింటికీ భిన్నంగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయ్యారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. దాంతో వారి ఇంట్లో తరుచుకుగా అధికారుల గురించి మాట్లాడుకునే వారు. దాంతో ఆమె యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పట్ల ఆకర్షితురాలు అయ్యింది. ఓ మంచి ఆఫీసర్‌ కావాలని నిర్ణయించుకుంది.
ఆష్నా ఘజియాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంది. లేడీ శ్రీ రామ్‌ కాలేజ్‌ నుంచి ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో ఆనర్స్‌ చేసింది. ఆ తర్వాత సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్‌ చేసింది. చదువుకునే సమయంలోనే ఆమె అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. అయితే జోష్‌ టెక్స్‌ ఈమెను తిరస్కరించింది. అంతటితో ఆగిపోకుండా, అధైర్యపడకుండా కృషి చేస్తూనే ఉంది. తన మాస్టర్స్‌ తర్వాత ఏడాది విరామం తీసుకొని యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయింది. ఈ పరీక్షల కోసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నిరంతరం చదువుకునేది. గత ఏడాది ప్రశ్నాపత్రాలను చదివి అందుకు తగిన టైమర్‌ని సెట్‌ చేసుకొని వాటిని పరిష్కరించేది. అయితే మొదటి రెండు ప్రయత్నాలల్లో ఆమె విఫలమయింది. కానీ పట్టిన పట్టు వదలకుండా కష్టపడి ప్రిపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్స్‌ మూడో ప్రయత్నంలో 116వ ర్యాంక్‌ సాధించింది. తన కలను నెరవేర్చుకుని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయింది.
‘మీకు ధైర్యం ఉన్నంత వరకు మీరు మీ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో విరమించ కూడదు. ఎందుకంటే ప్రయత్నించే వారు ఎప్పుడూ విఫలం కారు’ అని ఈ యువ ఐపీఎస్‌ అధికారిణి నేటి యువతకు సందేశం ఇస్తుంది. అలాగే ‘జీవితంలోని నమ్మిన సూత్రం ఏమిటంటే మీరు మీకు కావలసిన దాని కోసం రాత్రి, పగలు త్యాగం చేయాలని, లక్ష సాధన కోసం చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఇలా చేస్తే తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు’ అని కూడా చెబుతు న్నారు. ఆష్నా చౌదరది ఇప్పుడు చాలా మందికి రోల్‌ మోడల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్‌స్టాలో ఈమెకు రెండు లక్షల అరవై నాలుగు మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అందం, అధికారం మాత్రమే కాదు ఈమె చిరుతపులి లాంటిది అని ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.