
గుప్త నిధులు వస్తాయని ఆశతో ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ లోని ఓ ఇంట్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లో పూజలు చేస్తే ఆరోగ్య సమస్యలు పోవడంతో పాటు గుప్త నిధులు లభిస్తాయని మాయమాటలతో నమ్మబలికారు. సదురు మహిళ ఒప్పుకోవడంతో రాత్రి పాడుబడిన ఇంట్లో పెద్ద గొయ్యిని తవ్వి అందులో బొమ్మను ఉంచి పూజలు నిర్వహించారు. ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దాడులు నిర్వహించిన పోలీసులు పూజలను అడ్డుకుని పద్మతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూజల్లో ఓ మైనర్ బాలిక కూడా పాల్గొన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు.