పంజాబ్, హర్యానా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల కోసం వేసిన కమిషన్లు ఫలితాలు తీసుకొస్తున్నాయి. కర్నాటకలో 2005 సదాశివ కమిషన్, తమిళనాడులో 2008 జనార్ధన్ కమిషన్, ఉత్తరప్రదేశ్ లో 2001 హుకుం సింగ్ కమిషన్, మహారాష్ట్రలో 2003 లహుజీ కమిషన్ ప్రకారం వర్గీకరణ చేసుకునేందుకు ఆగష్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రూపంలో మార్గం సుగమమైంది. చేవెళ్ల డిక్లరేషన్ సభలో ” ఎస్సీలతోపాటు ఎస్టీ రిజర్వేషన్లను కూడా పంచుతాం, పంచాయితీ తెంచుతాం” అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే వర్గీకరణను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా తక్షణమే అమలు చేస్తామని ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే అసమానతలను ప్రామా ణిక కొలమానాల కచ్చితమైన డేటా అధారంగా శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మానవ పరిణామ క్రమంలో సమాజంలో వచ్చిన మార్పులు అసమానతలు చాలా బయటపడ్డాయి. ‘ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే వ్యత్యాసాలు ఉన్నప్పుడు కులాల మధ్య వ్యత్యాసాలు ఉండవా’ అనేది కులవాదుల అభిప్రాయం. అయితే ప్రాచీన కాలంలో బలవంతులు బలహీనులను బానిసలుగా చేసు కొని అధిపత్యం చేసేవారని చరిత్ర చూస్తే అర్థం చేసుకోవచ్చు. రానురానూ ఆధిపత్యం వర్ణ వ్యవస్థగా రూపాంతరం చెంది నట్లుగా కూడా అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ఆధునిక కాలం లో మేధో చైతన్యం కలిగినవారు తమ నైపుణ్యాలతో, ఎత్తుగడలతో వివిధ వర్గాలను తమ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. ఇప్పటివరకు జరిగిందిదే.వర్గీకరణ అంశంపై పేదల పక్షాన పోరాడే ఒకటి,రెండు పార్టీలు మినహా ఎవరికి స్పష్టత లేదు.రాజకీయాల కొలమానంగానే దీన్ని బలపరుస్తున్నారు. కానీ సామాజిక కోణంలో వ్యత్యాసాల్ని,అసమానతల్ని రూపుమాపేలా వర్గీకరణ ఉండాల్సిన అవసరం ఉన్నది.
మనదేశంలో 1882లో మొదటగా విలియం హంటర్ మహాత్మా జ్యోతిరావు పూలే బ్రహ్మణేతరులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధాన ప్రతిపాదన చేశారు. 1892 మధ్యకాలంలో కొల్హాపూర్ మహారాజు ఛత్రపతి సాహు మొదటిసారిగా బ్రహ్మణేతరులకు ఉద్యోగాల్లో బాగస్వామ్యం కల్పించారు. 1902లో దాన్ని చట్టబద్ధం చేసి యాభై శాతానికి పెంచుతూ చట్టం చేశారు. 1909లో బ్రిటిషువారు తమపాలనలో భారతీయులకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. 1921 సెప్టెంబర్ 16 జస్టిస్ పార్టీ తొలిసారిగా బ్రటిషు వారి చట్టాన్ని ఆమోదించడంతో ప్రజల చేత ఎన్నుకోబడిన మొదటి సంస్థగా చరిత్రకెక్కింది. 1932 రౌండ్ టేబుల్ సమావేశానంతరం సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించబడింది. స్వాతంత్య్రనాంతరం దేశంలో అస్పృశ్యత ఆధారంగా 1954 నుండి ఎస్సీ,ఎస్టీలకు అనంతరం కమిషన్ రిపోర్ట్ సూచనలతో వెనుకబాటుతనం ఆధారంగా 1970 సెప్టెంబర్ 23 నుండి జీవో నెం 1793 ద్వారా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ కులాలవారు తమను కూడా రిజర్వేషన్ల పరిధిలో చేర్చాలని ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. గుజ రాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాటిధర్, గుర్జర్ల ఉద్యమాలు అందుకు ఉదాహరణలు.కానీ వాటి లక్ష్యాలు నేరవేరలేదు.
1975లో పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో 32శాతం జనాభా కలిగిన ఎస్సీ కులాలకు ఉన్నటువంటి 25 శాతం రిజర్వేషన్లను, ఎ,బి అను రెండు కేటగిరిలుగా విభజించింది. 1994లో హర్యానా రాష్ట్రంలో 20శాతం జనాభా కలిగిన ఎస్సీ కులాలకు ఉన్న 20శాతం రిజర్వేషన్లను ఎ,బి కేటగిరి లుగా, 1997 జూన్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్లను ఎబిసిడి నాలుగు కేటగిరిలుగా విభజించింది. ఇవి చెన్నయ్య అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని హైకోర్టులో సవాలు చేయగా, చట్టం సరైనదేనని చెప్పిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా అర్టికల్ 341లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని వర్గీకరణ చట్టం చెల్లదని 2004 నవంబర్‌లో ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దాంతో దావింధర్ సింగ్ అనే వ్యక్తి, పంజాబ్ ప్రభుత్వం చేసిన వర్గీకరణ చట్టాన్ని పంజాబ్ హైకోర్టులో సవాల్ చేయగా చట్టాన్ని కొట్టి వేసింది. పంజాబ్ ప్రభుత్వం వెంటనే ఇవి చెన్నయ్య కేసు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక రాష్ట్రం, అనుకూల వ్యతిరేక సంఘాలు మొత్తం 22 మంది పిటిషన్ దారులమని కేసులో భాగస్వాములయ్యారు. 20ఏండ్ల సుదీర్ఘకాలం తర్వాత ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఆగష్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ తీర్పును వెలువరించింది.ఇది ఆహ్వానించదగిగ పరిణామం. అయితే ఇందులో అసమానతలు, కొలమానాలు, వర్గీకరణకు సంబంధించిన అంశాలు చాలా లోతుగా అధ్యాయనం చేయాల్సిన అవసరమైతే ఉన్నది.
రిజర్వేషన్ల వర్గీకరణ విదయా, ఉద్యోగ రంగాల్లో తగుప్రాతినిధ్యం కోసం చేశామని వాదించిన ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఎస్సీ కులాల ప్రగతి, ప్రతినిధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన తేడాలున్నాయి. ఎస్సీలతో పాటుగా ఎస్టీ ఉపకులాలకు రిజర్వేషన్ల విభజన ”పరిమాణాత్మక, ప్రదర్శించదగిన డేటా” ఆధారంగా నిర్వహించాలని, ”ఇష్టాలు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం” కాదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.అందుకు ఎస్సీ,ఎస్టీ కులాలను, వర్గీకరణ గ్రూపుల నిర్ధారణకు కొలమానాలుగా ముం దుగా జనాభా లెక్కలు చేపట్టాలనే వాదన ఇప్పుడు ముందుకొచ్చింది. ఇది అవసరం కూడా. బీహార్‌లో కులగణన చేపట్టిన తర్వాత కులాల మధ్య తారతమ్యాలు వెలుగుచూశాయి. అయితే సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సహజ సమన్యాయ సూత్రం పాటించేలా వర్గీకరిస్తే విమర్శలకు తావుండదు.
మామిడి నారాయణ
9441066032