నవతెలంగాణ – అశ్వారావుపేట : ఆయిల్ ఫాం సాగు చేసే రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను ఆయిల్ ఫెడ్ సకాలంలో చెల్లించాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పాం గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమా మహేశ్వర రెడ్డి,కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య సూచించారు.దీనితో పాటు తోటల క్షేత్ర సందర్శన చేసి రైతులకు అవసరమైన సూచనలు,తోటల నిర్వహణపై అవగాహన కల్పించాలని కోరారు. మండలంలోని నారంవారిగూడెం లోని ఆయిల్ ఫెడ్ కేంద్రీయ ఫాం ఆయిల్ నర్సరీ ప్రాంగణంలోని ఆయిల్ఫెడ్ డివిజన్ కార్యాలయంలో గురువారం డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణను వారు కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు విస్తరణ పెరుగుతున్న దృష్ట్యా రైతులకు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని, దీనివల్ల సాగు,ఆశించే తెగుళ్లు,వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు రైతులకు అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని వివరించారు.రానున్న రోజుల్లో విస్తరణకు అనుగుణంగా దిగుబడులు పెరగనున్నందున రెండో ఫ్యాక్టరీ నిర్మాణం అవశ్యకతను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.సానుకూలంగా స్పందించిన డీవో బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని సమాధానం ఇచ్చారు.ఆయిల్ ఫాం రైతుల సంక్షేమానికి ఆయిల్ ఫెడ్ మొదటి ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు.