– ఐటీసీలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో డీజీపీ రవి గుప్తా
నవతెలంగాణ-బూర్గంపాడు
రాబోయే పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం సారపాకలోని పబ్లిక్ స్కూల్లో హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌నకు చేరుకొన్నారు. డీజీపీకి పుష్పగుచ్చం అందజేసి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వాగతం పలికారు. అనంతరం ఐటీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలతో ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. చెక్ పోస్ట్ల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలని ఆయన ఆదేశించారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. డీజీపీతో పాటు అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ శివధర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజరు కుమార్, సీఆర్‌పీఎఫ్ సౌత్ జోన్ అడిషనల్ డీజీపీ రవిదీప్ సింగ్ సాహి, సీఆర్పి ఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారుసిన్హా, ఎస్‌ఐబి ఐజీపి సుమతిలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు ఎస్పీ డా.శబరీష్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే, ఎస్‌ఐబి ఎస్పీ రాజేష్, ఓఎస్డి కొత్తగూడెం సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ జితే, ట్రైనీ విక్రాంత్ సింగ్, సిఆర్పిఎఫ్ అధికారులు ఆర్.కె పాండా, ఎం.కె మీనా, మోహన్, రితేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.