అధికారులు సమన్వయంతో పని చేయాలి

– మండల ప్రత్యేక అధికారి అప్పయ్య
– వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
నవతెలంగాణ -తాడ్వాయి
మండలాభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. మంగళవారం స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సుమన వాణి లతో, వివిధ శాఖల అధికారులతో కలిసి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమన్వయంతో కృషి చేయాలి అన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సాగు త్రాగునీరు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
గ్రామాల్లో ఇంకా ఏ విధంగా విధులు నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందో తెలుపాలన్నారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలకు ప్రతి కుటుంబానికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికందేలా కృషి చేయాలన్నారు. విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి, పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని ప్రతి ఒక్కరికి వైద్యం అందే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ తోట రవీందర్ ఎంపీడీవో సుమన వాణి, ఎడ్యుకేషనల్ నోడల్ ఆఫీసర్ రేగ కేశ్వరావు, ఎంపీ ఓ శ్రీధర్ రావు, ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు, పంచాయతీ సెక్రటరీ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.