ముంచిన వసుధ మొక్కజొన్న సాగును పరిశీలించిన అధికారులు 

– నవతెలంగాణ కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ
– పంటనష్టం వాటిల్లింది వాస్తవం
– పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం
– వ్యవసాయ శాఖ అధికారి 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదుగురు రైతులు వసుధ 161 ఆడామగా మొక్కజొన్న విత్తనాలతో రబీ సాగు చేసిన నేపథ్యంలో పంట దిగుబడి సంబంధిత మొక్కజొన్న కంపెనీ యాజమాన్యం చెప్పిన దానికి భిన్నంగా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో రబీ సీజన్ లో సంబంధిత కంపెనీ ఉద్యోగుల మాయమాటలు నమ్మి మొక్కజొన్న పంట వేసి, ఒక్కో రైతు ఎకరాకు సుమారు రూ.40 వేలు, 5గురు రైతులు కలిసి రబీ మొక్కజొన్న సాగు చేసిన మొత్తం 14.5 ఎకరాలకు గాను రమారమి రూ.5 లక్షల 80 వేలు అప్పుచేసి, పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా నష్టపోయిన బాధిత రైతులకు నవతెలంగాణ దినపత్రిక అండగా నిలుస్తూ “ముంచిన వసుధ మొక్కజొన్న విత్తనం..!” అనే శీర్షికతో సోమవారం కథనం ప్రచురించిన విషయం విదితమే. నవతెలంగాణ దినపత్రి కథనానికి స్పందించిన ఆళ్ళపల్లి వ్యవసాయ శాఖ అధికారి జి.రామారావు సోమవారం ఏఈఓ విజయ్ వంశీని బాధిత రైతుల మొక్కజొన్న పంటలను పరిశీలించమని ఆదేశించారు. అందులో భాగంగా పంటలను పరిశీలించిన అనంతరం ఏఈఓ మాట్లాడుతూ.. ముందుగా మోసగించిన మొక్కజొన్న కంపెనీ ఉద్యోగులు బాండ్ పేపర్లపై రైతుల సంతకాలు తీసుకున్నారా? లేదా? అడిగి తెలుసుకున్నామని అన్నారు. ఎటువంటి పేపర్ల పై కానీ, బాండ్ లపై గాని రైతులు సంతకాలు చేయలేదని చెప్పారన్నారు. ఐదుగురిలో నలుగురి మొక్కజొన్న పంట చేలు పరిశీలించడం జరిగిందని, రైతులు పంట నష్టపోయిన విషయం వాస్తవమని, అది మొక్కజొన్న పంట ఎదుగుదల సరిగా లేకపోవడం, చిన్న సైజులో ఉన్న మొక్కజొన్న కంకి పరిమాణాన్ని బట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అదేవిధంగా రెండు రోజుల లోపు 5గురు రైతులు పంట నష్టపోయిన మొక్కజొన్న విత్తనాల నమూనాలను సేకరించి, ప్రయోగశాల (ల్యాబ్ )కు పంపడం జరుగుతుందని తెలిపారు. విత్తనాలు కల్తీవని తేలినా? సంబంధిత మొక్కజొన్న కంపెనీకి ప్రభుత్వ గుర్తింపు లేకున్నా? అదే విషయాన్ని మా పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పూర్తి విచారణ చేపట్టి, మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం సంబంధిత మొక్కజొన్న కంపెనీ యాజమాన్యం ద్వారా ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. దానికి గాను ముందుగా ఆళ్ళపల్లి బాధిత రైతులు కొమ్మ శ్రీను, బట్టు సురేష్, పరమ రమేష్, గుండె బోయిన రామకృష్ణ, నాతి దుర్గేష్ ల నుంచి రాతపూర్వకంగా దరఖాస్తు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.