గుడిసెలపై అధికారుల జులుం

cpm dharna– హనుమకొండలో అర్ధరాత్రి బుల్డోజర్లతో కూల్చివేత
– అడ్డుకోబోయిన నేతలు, పేదల ఈడ్చివేత
– కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
– ఇండ్లు, స్థలాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
– రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-హనుమకొండ
హనుమకొండ జిల్లాలోని గోపాలపురం చెరువుశిఖంలో రెండేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలను గత అర్ధరాత్రి (జనవరి 10) ఒంటిగంటకు 500మంది పోలీసులతో కలిసి అధికారులు చుట్టుముట్టారు. బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో గుడిసెలను కూల్చివేస్తూ పేదలను భయాబ్రాంతులకు గురిచేశారు. విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నేతలు ఘటనా స్థలికి చేరుకునే ప్రయత్నం చేయగా, వారిని అడ్డుకున్నారు. అప్పటికే గుడిసెలను నేలమట్టం చేశారు. దీన్ని నిరసిస్తూ గురువారం స్థానిక ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. గుడిసెవాసులపై అధికారుల దమనకాండను ప్రతిఒక్కరూ అందరూ ఖండించాలని కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పక్కా ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఇంటి స్థలం లేక వేలాదిమంది పేదలు ఎదురుచూసి.. విసిగిపోయి నగరంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అక్కడే నివాసముంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని చెప్పారు. ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పక్కా ఇండ్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ హామీని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. నెల రోజులు తిరగకుండానే గుడిసెవాసులపై దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. గోపాలపురం చెరువులో 22 ఎకరాల భూమి ఉండగా.. అందులో 12 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులు యథేచ్ఛగా అమ్ముకున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం నిలువ నీడలేని పేదలు గుడిసెలు వేసుకొంటే ప్రతాపం చూపడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానం మేరకు ఇండ్లు లేని పేదలకు స్థలం పట్టాతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదల పక్షాన ఉండి పోరాడతామన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. అర్ధరాత్రి గుడిసెలను కూలుస్తుంటే అడ్డుకోబోయిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.ఉప్పలయ్య తదితర నాయకులను, గుడిసెవాసులను, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. గుడిసెల కూల్చివేతపై కలెక్టర్‌తో చర్చించారు. కలెక్టర్‌ స్పందించి.. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చుక్కయ్య, నాయకులు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్‌, జి రాములు, డి.తిరుపతి, మంద సంపత్‌, నోముల కిషోర్‌, జయశ్రీ, ఓ.సాంబయ్య, వల్లెపు రాజు, కె.కుమార్‌, అశోక్‌, యాకయ్య, వెంకటయ్య, లింగమూర్తి, మల్లయ్య, కొమురెల్లి, ఎం.రమ, ఉమ, జగన్‌ పాల్గొన్నారు.