
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులతో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ మాట్లాడుతూ మొక్కల మీదే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. చెట్లు లేకపోతే మానవ మనుగడే లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటి పెంచడమే పరిష్కారం అన్నారు. నేడు మనం నాటిన మొక్కలే వృక్షాలై భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ ను అందిస్తాయన్నారు.మొక్కలను నాటి వాటిని పెంచడం ప్రజలు తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. రేంజ్ అధికారి రవీందర్ మాట్లాడుతూ అడవులను సంరక్షించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. అటవీ రేంజ్ పరిధిలో అనుమతులు లేకుండా చెట్లను కొడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అడవులను పెంచడం పైనే వన్యప్రాణుల, జంతువుల మనగడ ఆధారపడి ఉందన్నారు. రేంజ్ పరిధిలో ఎక్కడైనా చెట్లు నరికివేతకు గురైతే తమ సిబ్బందికి సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అధికారులు అటవీ రేంజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటి నీళ్లు పోశారు.కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపిఓ విద్యానంద్, అటవీ రేంజ్ అధికారి బి.రవీందర్, డిప్యూటీ రేంజ్ అధికారులు ఏ శ్రీనివాస్, బి దేవిదాస్, టి మహేందర్ కుమార్, అటవీ బీట్ అధికారులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రమా, కార్యాలయ సిబ్బంది, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బుచ్చి మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.