మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ శ్యాంసుందర్,తహశీల్దార్ రవి కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా”కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు తదితర పథకాలపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయంపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని కుటుంబాలు వ్యవసాయ కూలిపని మీదన ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఒక భరోసా కల్పించడానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” అమలు చేయుటానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపారు.ఈ పథకం ఈనెల 26 నుండి అమలు చేయబడుతుందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి, 2023-24 ఆర్థిక సంవత్సరం లో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకానికి అర్హులని తెలిపారు. అట్టి ఒక్కో కుటుంబానికి రెండు విడతలుగా, ఒక్కో విడతకి రూ.6వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వెలు ఆర్థిక సహాయం విడుదల చేయబడుతుందన్నారు.డిపిటి పద్ధతిలో నిధులు వ్యవసాయ కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేయ బడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాది ఎపిఓ హరీష్,ఎంపిడిఓ,ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.