అధికారుల హడావుడి

అధికారుల హడావుడి– చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన..
– సాగునీటి శాఖ ప్రాజెక్టుల నిర్వహణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ప్రతిష్టాత్మకంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు విఫలమయ్యాక రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమయానుకూలంగా అపరేషన్‌ ప్రోటోకాల్‌ను పాటించకపోవడంతో పలు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తాజాగా భావిస్తున్నది. ఇప్పటివరకు లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుల ఆలనా, పాలనా చూడటంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అలాగే ప్రభుత్వాలు సైతం ప్రాజెక్టులు నిర్మించడంలో చూపిన శ్రద్ధ, నిర్వహణలో పట్టించుకోవు. కనీసం నీటిని పంపిణీ చేసే కాలువల నిర్మాణం గురించీ ఆలోచించవు. కాళేశ్వరం బ్యారేజీలు విఫలం కావడం, మరో వారం పది రోజుల్లో వానాకాలం సీజన్‌ రానుండటంతో అధికారుల్లో హడావుడి పెరిగి ఆందోళన సైతం ప్రారంభమైంది.
డ్యామ్‌లు, బ్యారేజీలకు సమయానుకూలంగా మరమ్మతులు చేయడం, గేట్లు, కాలువల నిర్వహణ, ఇతర పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలనే భావనతో రాష్ట్ర సాగునీటి శాఖ ఉంది. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఐదు వేల ఎకరాల్లోపు ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకుగాను 44,119 వనరులు అందుబాటులో ఉన్నాయి. ఐదు వేల నుంచి 25 వేల ఎకరాల్లోపు సాగునీటిని అందించే ప్రాజెక్టులు 40 వరకు , 25 వేల ఎకరాలకుపైగా సాగునీటిని అందించే భారీ ప్రాజెక్టులు 32 వరకు ఉన్నాయి. వీటిలో కొన్నింటి నిర్మాణం పూర్తయింది. మరికొన్నింటి పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. నిధుల కొరత ప్రాజెక్టులను వేధిస్తున్నది. నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమవుతున్నది.
కృష్ణా, గోదావరి బేసిన్‌పై రాష్ట్రం ఆధారపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలను నెరవేర్చుకునేందుకుగాను ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు. ఆయా ప్రాజెక్టుల మరమ్మతులకు గాను రాష్ట్ర సాగునీటి శాఖ ఇంజినీర్లు పలురకాల ప్రతిపాదనలను రూపొందించి ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి కేఆర్‌ఎంబీ అనుమతించింది. అలాగే వర్షాల నేపథ్యంలో గేట్లు, పంపుహౌజ్‌ల నిర్వహణ, మోటార్లు, పంపులు, ప్యానెల్‌ బోర్డులకు సంబంధించి అన్ని నిర్వహణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చిన్న నీటి వనరులను సైతం నిర్లక్ష్యం చేయరాదని ప్రభుత్వం భావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లను ప్రతియేటా ఎండా కాలంలో దిగువకు వదిలేసి, డ్యామ్‌ల పరిస్థితిని అంచనా వేయాలన్నది ఆపరేషన్‌ ప్రోటోకాల్‌. ఈ సందర్భంగా అవసరమయ్యే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోవడంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయని సమాచారం. సాగునీటి శాఖ తన విధులను నిర్తర్తించడంలో, ప్రభుత్వంతో నిర్భయంగా చర్చించడం లోనూ విఫలమైంది. దాని ప్రతిఫలమే నేటి రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, దాని బ్యారేజీలు ప్రశ్నార్థకమయ్యాయి. విలువైన ప్రజాధనం దుర్వినియోగమైంది. కానీ, తీరా వానలు పడుతున్న తరుణంలో హడావుడి ఆశ్చర్యం కలిగిస్తున్నదని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.