నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు,ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని,పనిలో నాణ్యత ఉండేలా చూడాలని,పరిపాలన పట్ల, జిల్లా యంత్రాంగం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని,పనివేళల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని,
ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజావాణి కి 96 ఫిర్యాదులు…
కాగా ఈ సోమవారం సైతం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెన్షన్లు, భూముల సర్వే, సదరం సర్టిఫికెట్లు, భూముల వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించారు. ఆశ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని,మండల,గ్రామ స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులు వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఫిర్యాదుల పరిష్కారం పై పిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని,ఒక వేళ పిర్యాదు పరిష్కారం కానట్లైతే అందుకు గల కారణాలను తెలియజేయాలని అన్నారు.సోమవారం 96 ఫిర్యాదులను ప్రజలుఅందజేశారు.ఇందులో రెవెన్యూకు సంబంధించి 53 రాగా తక్కిన 43 వివిధ అంశాలకు సంబంధించి ఉన్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ , జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.