– జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
– అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దు
– స్వచ్ఛందంగా పునరావాస కేంద్రానికి ప్రజలు తరలిరావాలి
నవతెలంగాణ-ములుగు
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం కన్నాయిగూడెం మండలం కంతాన్‌పల్లి 2వ లోలెవల్ వంతెన, గోవిందరావు పేట మండలంలోని రాఘవపట్నం దయ్యాలవాగు వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దష్టిలో ఉంచుకొని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని కలెక్టర్ సూచించారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను సూచించారు. గోదావరికి ఎగువనున్న నుండి వచ్చే వరదకు వాగులు వంకలన్నీ ఉధతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తహశీల్దార్‌లు, ఎంపిడివోలు తమ మండల పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఉధతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రోజెక్ట్ లలోని నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, ఐకేపీ సీసీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి జ్వరాలు, డెంగ్యూ, ఇతర కేసులను గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకుని వైద్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలన్నారు.నీటిపారుదల శాఖ సిబ్బంది ఏ ఈలు వారి వారి పరిధిలోని చెరువులను తనిఖీ చేయాలి. సందర్శించిన ఫోటోలను సమర్పించాలని, ఏదైనా అత్యవసర మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి పూర్తి చేయాలి. ఈ ఈ ల ద్వారా నివేదికలను సమర్పించాలన్నారు. గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోందని, ఈ వరద వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు, రహదారుల గురించి, సమాచారం ప్రజలకు చేరవేయాలి. ఆ ప్రాంతంలో రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముంపు ప్రాంతాల ప్రజలు ఎగువ సురక్షిత ప్రదేశానికి తరలించాలని సూచించారు. వర్షాకాలం దష్ట్యా తక్షణ సహాయం కొరకు ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్. 6309842395. ల్యాండ్ లైన్ నెంబర్ 08717-293246 లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, తహసీల్దార్, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.
ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాల్లో పని చేస్తున్న కార్మికులకు మెరుగైన సౌకర్యాలకు చర్యలు
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఇటుక బట్టిలు, నిర్మాణ స్థలములో పనిచేస్తున్న కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం ములుగు మండలం బండారుపల్లి గ్రామంలో గల ఎ.ఆర్ ఇటుక బట్టిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా సహాయ కార్మిక అధికారి వి.వినోదతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఒడిసా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన 8మంది కార్మికలను వారి సమస్యలు, వేతనం వివరములు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలంలో పని చేస్తున్న కార్మికులకు పని ప్రదేశంలో మెరుగైన సౌకర్యాలు, కార్మికుల పిల్లల సంరక్షణకు వసతి ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సమర్పించాలని సహాయ కార్మిక అధికారిని ఆదేశించారు. నిర్మాణ రంగం సంబందించిన కార్మిక సంఘాల నాయకులతో వచ్చే వారం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.