తెలుగు వాచకం వాపస్ చేయమన్న అధికారులు..

– వెనక్కి తీసుకునే పనిలో ఎం.ఆర్.సీ సిబ్బంది..
– మాజీ సీ.ఎం పేరు నమోదు అవడమే కారణం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది విద్యా సంవత్సరం విద్యార్ధులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లో తెలుగు వాచకంను వెనక్కి ఇవ్వాల్సిందిగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం, వాటిని వాపస్ చేసుకోవడానికి మండల స్థాయి సిబ్బంది నిమగ్నం అయ్యారు. సింగిడి తెలుగు వాచకం లో ముందుమాట గా నాటి పాలకుల పేర్లు నమోదు అయి ఉండటమే కారణంగా చూపుతున్నారు. వాస్తవానికి ఈ అచ్చు పుస్తకాన్ని 2022 – 23 విద్యా సంవత్సరం ప్రచురించారు. రెండో పేజీలో ముందుమాట గా ఉన్న సమాచారంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొలి వాచకం ఇది,పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, విద్యాశాఖ పూర్వపు మంత్రులు శ్రీ జి. జగదీశ్ రెడ్డి గారికి, శ్రీ కడియం శ్రీహరి గారికి, ప్రస్తుత విద్యా శాఖా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్. ఆచార్య గారికి, పాఠశాల విద్యాశాఖ పూర్వపు సంచాలకులు శ్రీ ఎమ్. జగదీశ్వర్ గారికి, ప్రస్తుత సంచాలకులు శ్రీ టి.చిరంజీవులు గారికి, ప్రభుత్వ సలహాదారు డా॥ కె.వి. రమణాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వాచక రూపకల్పనలో పాల్గొన్న కమిటీ సభ్యులు, సంపాదక మండలి సభ్యులు, విషయ నిపుణులు, ఉపాధ్యాయులు, చిత్రకారులకు ధన్యవాదాలు. ఈ వాచకాన్ని మరింత అందంగా ఆకర్షణీయంగా రూపొందించడానికి సాంకేతిక సహకారమందించిన, టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ బృందం, హైదరాబాద్ వారికి, శ్రీ రమేష్ ఖడే, కమ్యునికేషన్ ఆఫీసర్, సిఇటిఇ, టిస్, ముంబయి గార్లకు మరియు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ వారిచే గుర్తించబడిన డిజైనర్లకు మా ప్రత్యేక ధన్యవాదములు. ఈ వాచకం పిల్లల్లో భాషాభిరుచి, సాహిత్యాభిలాష, భాషా సామర్థ్యాలను పెంపొందించి ఉత్తమ వైఖరులు కల్గిన వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. తేది: 05-12-2022 స్థలం : హైదరాబాద్ అని ఉంది. ఇందులో నాటి పాలకుల పేర్లు ఉన్నందున పంపిణి చేసిన అన్ని పుస్తకాలను వెనక్కి తీసుకుని ప్రస్తుత పాలకుల పేర్లు ముద్రించి ఇస్తారట.దీనికి అయ్యే వ్యయం ప్రజాధనమే కధా.. పాఠ్యాంశాల్లో తప్పులుంటే తొలగించాల్సిందే. కానీ నాడు ముద్రించిన పుస్తకాల్లో నాటి పాలకుల పేర్లు తొలగించడానికి ఇంత వ్యయం అవసరమా? అనేది పలువురు ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.