అయ్యా! నేను చదువుకుంటాను

Yay! I will studyరామాపురం సర్కారు బడిలో రాజు ఏడవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. రాజుకు చదువంటే చాలా ఇష్టం. ఉన్నత తరగతులు పొరుగూరులో ఉన్న కోడూరు పెద్ద బడిలో చదవాలని కోరిక. రాజు తండ్రి గోపయ్య మధ్యతరగతి రైతు. పొలం పనుల్లో తనకు తోడుగా ఉండేందుకు రాజు చదువు మాన్పించాలని గోపయ్య అనుకున్నాడు.
గోపయ్య నిర్ణయం విని రాజు చాలా ఏడ్చాడు. అమ్మ ద్వారా నాన్నను ఒప్పించాలని బతిమాలాడు.
”చదివింది చాలు, పొరుగూరికి వెళ్ళి చదవాలంటే సైకిల్‌ కొనివ్వాలి. పుస్తకాలు, బట్టలకు బాగా ఖర్చు అవుతుంది. అదే నువ్వు పొలం పనులు చేసావంటే మనకు ఎంతో లాభం ఉంటుంది బాబు” అమ్మ రాజుని బుజ్జగించింది.
రాజు ఎలాగైనా చదవాలని పట్టుబట్టాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అతని తల్లిదండ్రులు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. రాజుకు ఏమి చేయాలో అర్థం కాలేదు. బంధువుల్లో కూడా తన వయసు పిల్లలు ఎవరు చదవలేదు. కనీసం బడికి ఒక్క రోజు కూడా వెళ్ళనివారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు గొర్రెల కాపర్లు కాగా, మరి కొందరు పొలం పనులు చేస్తున్నారు.
రాజు నిద్రాహారాలు మాని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
”ఈ మాత్రం చదివించడమే తప్పయింది. చిన్నప్పుడే పనిలో పెడితే ఈ బాధ ఉండేది కాదు” అని తల్లిదండ్రులు బాధపడినారు.
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులు కొత్త బడిలో చేరారు. రాజు మనసంతా దిగులుగా ఉంది. పొలం పనులకు వెళ్తున్నాడే కాని మనసంతా బడి చుట్టే తిరుగుతుంది. తల్లిదండ్రులను ఒప్పించే మార్గం కనబడడం లేదు.
పగలు, రాత్రి ఒకటే ధ్యాస. ఎలాగైనా చదువుకోవాలి. లేకుంటే జీవితం ఈ పొలానికే అంకితమవుతుంది. తరగతి లో ఉపాధ్యాయులు ‘రాజు చాలా తెలివైనవాడు. బాగా చదువుతాడు. మంచి ఉద్యోగం వస్తుంద’ని మెచ్చుకునే వారు. అవన్నీ ఒట్టి మాటలేనా..? అనుకున్నాడు.
రాజు మది నిండా చదువు ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఒత్తిడితో పసి మనసు గాయమైంది. తీవ్రమైన జ్వరం వచ్చింది. నిద్రలో ”చదువుకుంటాను, చదువుకుంటాను” అని కలవరించాడు. తల్లిదండ్రులకు రాజు తపన అర్థమైంది. వెంటనే రాజును పొరుగూరి పెద్ద బడిలో చేర్పించారు.
– దుర్గమ్‌ భైతి, 9959007914