అక్కడ చినుకు చుక్క
కన్నీటి చుక్కని
తనలో కలిపేసుకుంది
కొన్ని జీవితాలను
సంద్రంలో నెట్టేసింది
పట్నం చెరువైనాక
గుండె తరుక్కుపోయింది
అయ్యో సారూ
కాస్త ఒడ్డుకేయండ్రి
ఇండ్లన్నీ తారుమారై
వీధులన్నీ వాగులై
విధి వెక్కిరించింది
చెట్టు కొమ్మలే
ఆపన్నహస్తాలయ్యాక
నాడి ఆడటం మొదలెట్టింది
ఆకలి మంటల్లో
పేగులు కాలిపోతాంటే
శరీర బడలిక
సడలిపోతాంది సారూ
కూకున్న కాడనే
ముడుచుక్కూర్చున్నాం
పిల్ల పాప ముసలి ముతకా
తెగిపోయిన బంధాలన్నీ
తారుమారైనాక
ఉదరపు కోతల బాధలో
ఆకలి చచ్చిపోయింది
బడుగు జీవనాలన్నీ
బురద మడుగుల్లో
ఇరుక్కుపోయినాక
కునుకు కరువైంది సారూ
అయ్యో సారూ
మునిగిన మేడలకేసి చూస్తూ
మూర్చపోకండ్రి
కూలిన పేద మిద్దెల గోడు
ఆకలి రోదన పోరుని
కూసింతైనా సూడండ్రి
గట్టున పడేయండ్రి
– నరెద్దుల రాజారెడ్డి
సెల్: 9666016636