
– శరవేగంగా పరిశ్రమల నిర్మాణాలు…
– ఆదా కానున్న విద్యుత్ వ్యయం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే నియోజక వర్గంలో అశ్వారావుపేట మండలం లో గల పరిశ్రమను 30 నుండి 60 టన్నుల సామర్ధ్యం,దమ్మపేట మండలం అప్పారావు పేట పరిశ్రమను 60 నుండి 90 టన్నుల సామర్ధ్యం కు పెంపుదల చేసారు. ప్రస్తుతానికి అశ్వారావుపేట లో రూ.33 కోట్ల వ్యయంతో 2.5 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,ఇదే వ్యయం,ఇదే సామర్ధ్యం తో అప్పారావు పేట లో మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మాణం చేపట్టారు.అప్పారావు పేట లోనే డీమఖ్ ను పౌడర్ గా మార్చే ఎం.ఇ.ఇ పరిశ్రమను పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో రూ.30 కోట్లు వ్యయంతో నిర్మించారు. ఈ క్రమంలోనే విస్తరించిన ఆయిల్ ఫాం సాగుకు అనుగుణంగా ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజక వర్గం,వేంసూరు మండలం కల్లోరిగూడెం లో ఒకటి,సిద్దిపేట లో మరొకటి 30 నుండి 90 టన్నుల సామర్ధ్యం నమూనా తో రెండు నూతన ఫాం ఆయిల్ పరిశ్రమలు నిర్మాణం ప్రాధమిక దశలో ఉన్నాయి. ఇపుడు పామాయిల్ పరిశ్రమలో చేపట్టిన పవర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. విద్యుత్తు కొరత లేకుండా నిరంతరాయంగా పామాయిల్ పరిశ్రమకు సరఫరా అందించేందుకు వీలుగా దీని నిర్మాణం చేపట్టారు. 2.5 మెగా వాట్ లు సామర్ధ్యం తో గత ఏడాది సెప్టెంబరులో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టులో పనులు పూర్తయి ప్లాంటు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.ప్రస్తుతం విద్యుత్తు కు ట్రాన్స్ కో పై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్తు సంస్థకు ఏడాదికి రూ.1.25 కోట్లు బిల్లు చెల్లిస్తున్నారు.ఈ నిర్మాణం పూర్తయితే ఏడాదికి కోటి నుంచి రూ.1.10 కోట్లు ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.పామాయిల్ పరిశ్రమలో గెలలు గానుగ ఆడ గా వచ్చిన ఫైబర్,పీచును ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇందనంగా వినియోగించనున్నారు. ఇందుకోసం ప్లాంటులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గంటకు 30 టన్నుల సామర్ధ్యం తో పరిశ్రమ నడుస్తోంది. 60 టన్నుల సామర్ధ్యం తో విస్తరించనున్న పరిశ్రమ పనులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దమ్మపేట మండలం అప్పారావు పేట పామాయిల్ పరి శ్రమను గంటకు 60 నుంచి 90 టన్నుల కు విస్తరించారు. అశ్వారావుపేట పరిశ్రమలోనూ విస్తరణ పూర్తయితే మొత్తంమీద గంటకు 150 టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది.
ఈ ఏడాది జూన్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం : ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి
అశ్వారావుపేట లో రూ. 33 కోట్లు వ్యయం 2.5 మెగా వాట్ లు సామర్ధ్యం తో నిర్మిస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఈ ఏడాది జూన్ లో నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేస్తాం. దీంతో ట్రాన్స్ కో కు చెల్లించే వార్షిక వ్యయం ఆదాతో పాటు, పరిశ్రమ కు అంతరాయం లేని విద్యుత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.