విస్తీర్ణం కు అనుగుణంగా పరిశ్రమలు పెంపు: ఆయిల్ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం కు అనుగుణంగా పరిశ్రమలు నిర్మాణం చేపడతామని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రెండు రోజులుగా సంస్థ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం అశ్వారావుపేట నియోజక వర్గం లోని,అశ్వారావుపేట మండలం పండు వారి గూడెం లో నూతన ఆయిల్ ఫాం సాగు ప్రారంభిస్తున్న నడింపల్లి శివరామరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో  మొక్క నాటారు.ఈ రైతు ఓకే సారి 54 ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు మొగ్గు చూపడంతో చైర్మన్ రామక్రిష్ణారెడ్డి లాంచనంగా మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట బుధవారం మరో నూతన పరిశ్రమ నిర్మాణానికి నాంది పలుకుతున్నామన్నారు. ఈ క్రమంలో 2.5 మెగా వాట్ లో బాయిలర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ఫెడ్ ఆద్వర్యంలో 16 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు విస్తరిస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే 3 వేలు పై చిలుకు ఎకరాలకు మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమల మేనేజర్లు బాలకృష్ణ, కళ్యాణ్ గౌడ్, నాగబాబు ఫీల్డ్ ఆఫీసర్స్ శ్రీకాంత్, చందు రైతులు పాల్గొన్నారు.